Movies

రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ అని నా అభిప్రాయం!

రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ అని నా అభిప్రాయం!

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. బాబీ దేవోల్‌ (Bobby Deol) ప్రతినాయకుడిగా, అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) హీరో తండ్రిగా నటించారు. డిసెంబరు 1న (Animal Release Date) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ (దూలపల్లి)లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Animal Pre Release Event) నిర్వహించారు. అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), అగ్ర నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) ముఖ్య అతిథులుగా హాజరై, సందడి చేశారు.

వేడుకనుద్దేశించి మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘యానిమల్‌’ సినిమాపై మీరు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ చూశా.. అదిరిపోయింది. ఇంతటి ఒరిజినల్‌ ట్రైలర్‌ నేను ఇప్పటివరకు చూడలేదు. సందీప్‌ ఫోన్‌ చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. ఆయన అంటే నాకు ఇష్టం. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని విన్నా. ట్రైలర్‌లోని అనిల్‌ కపూర్‌ సర్‌ నటన చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాబీ దేవోల్‌ యాక్టింగ్ నన్ను ఆకట్టుకుంది. రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. నటిగా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. రణ్‌బీర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పా గానీ తేలిగ్గా తీసుకున్నారు. అందుకే ఈ వేదికపై మరోసారి చెబుతున్నా. రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ అని నా అభిప్రాయం. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అన్నారు.

సందీప్‌.. ఆ ఫార్ములాను బ్రేక్‌ చేశాడు: రాజమౌళి
‘‘మా ప్రేక్షకులు (తెలుగు ఆడియన్స్‌) ఇలా ఉంటారు’ అని బాలీవుడ్‌ వాళ్లకు చూపించాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఈరోజు అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, భూషణ్‌కుమార్‌లకు మిమ్మల్ని చూపిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. ఏటా కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు తెరకెక్కించి ఘన విజయాలు అందుకుంటారు. కానీ, సినిమాని ఇలానే తీయాలనే ఫార్ములాను బ్రేక్‌ చేసే దర్శకులు అరుదుగా వస్తుంటారు. అలా నాకు తెలిసిన వారిలో రామ్‌గోపాల్‌ వర్మ, సందీప్‌ రెడ్డి వంగా ఉన్నారు. టీజర్‌ చూడగానే ‘యానిమల్‌’ చిత్రాన్ని చూడాలని నిర్ణయించుకున్నా. బాలీవుడ్‌లో నా ఫేవరెట్‌ హీరో ఎవరని అడిగిన ప్రతిసారీ నా సమాధానం రణ్‌బీర్‌ కపూర్‌. అద్భుతమైన నటుడాయన’’ అని ప్రశంసించారు.

‘ఒక్కడు’ చూసి మహేశ్‌కు మెసేజ్‌ పెట్టా: రణ్‌బీర్‌
‘‘యానిమల్‌’లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సందీప్‌ రెడ్డికి మరోసారి ధన్యవాదాలు. అనిల్‌ కపూర్‌తో నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. బాబీ దేవోల్‌ నా సోదరుడులాంటివాడు. రష్మిక బాగా నటించింది. మహేశ్‌ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంటనే ఆయనకు మెసేజ్‌ పెట్టా. ఈరోజు నా సినిమా వేడుకకు ఆయన అతిథిగా రావడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు మంత్రి మల్లారెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. మహేశ్‌ నటించిన ‘బిజినెస్‌మేన్‌’ సినిమాని చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని మల్లారెడ్డి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z