త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘మంచివాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. అందుబాటులో ఎవరుంటారు? నియోజకవర్గం కోసం ఎవరు పనిచేస్తారు? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలి. 2004లో కాంగ్రెస్‌తో భారాస (నాటి తెరాస) పొత్తు పెట్టుకుంటే నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2005లో తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని దిగితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఉన్న తెలంగాణను 1956లో ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పుడు ఆకలి కేకలు తప్ప ఏమీ లేదు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకిచ్చారు?పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లుందో ప్రజలు గమనించాలి’’అని కేసీఆర్ అన్నారు
👉 – Please join our whatsapp channel here –