Politics

ఇక వీరి సంగతి తేలాలి

ఇక వీరి సంగతి తేలాలి

మంత్రుల్లో(AP Ministers) సగం మందికి మళ్లీ టికెట్‌ దక్కుతుందనే స్పష్టత ఇంకా లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 25 మంది మంత్రుల్లో 11 మందికే ఈసారి టికెట్లపై స్పష్టత కనిపిస్తోంది. మిగిలినవారిలో కొందరిని ఈసారి లోక్‌సభ బరిలోకి దించాలని పార్టీ పరిశీలిస్తుండగా.. మరికొందరికి స్థానికంగా వ్యతిరేకత వల్ల టికెట్ల సంగతి తేలట్లేదు. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని వైకాపా నాయకత్వం చూస్తోంది. వీరిలో గుమ్మనూరు జయరాం, ఉష శ్రీచరణ్‌, విడదల రజిని, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్‌, జోగి రమేష్‌ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని జయరాంకు ముఖ్యమంత్రే చెప్పారు. ఆలూరు టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని జయరాం కోరినా.. ఇంకా స్పష్టత రాలేదు.

ఉష శ్రీచరణ్‌ను ఈసారి ఆమె సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న రాప్తాడు అసెంబ్లీ లేదా, హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైకాపా కసరత్తు చేస్తోంది. ఒకవేళ శాసనసభాపతి తమ్మినేని సీతారాంను ఎంపీగా పోటీకి దించితే ధర్మానను శ్రీకాకుళం ఎమ్మెల్యేగా బరిలోకి దింపనున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా అవసరమైతే ఈసారి అమర్నాథ్‌ను లోక్‌సభ బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం అనకాపల్లిలో వ్యతిరేకత ఉన్నా.. అక్కడి నుంచే పోటీకి ఆయన సిద్ధమయ్యారు. జోగి రమేష్‌ను విజయవాడ/ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించడంపై పార్టీ సర్వేలు చేయిస్తోంది. ఆయన ఈసారి మైలవరంలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, పార్టీ మాత్రం రమేష్‌ను అయితే ఎంపీగా.. లేదా పెడనలోనే పోటీకి దించాలని చూస్తోంది.

ఇప్పటికి వీరికే స్పష్టత..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌బాషా, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, సీదిరి అప్పలరాజు తదితరులకు టికెట్లు దాదాపు ఖాయమేనంటున్నారు. వీరిలో బొత్స ఆరోగ్య కారణాల రీత్యా.. వీలైతే రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ ఈసారికి చీపురుపల్లి నుంచే బరిలోకి దిగాలని సీఎం సూచించినట్లు ప్రచారం ఉంది. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని బుగ్గన కోరుతున్నారు.

సురేష్‌ను యర్రగొండపాలెం నుంచి కాకుండా కొండపి నుంచి పోటీచేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ పరిశీలిస్తోంది. తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజుకు టికెట్లు దాదాపు ఖాయమే. అయితే కొవ్వూరులో ఎస్సీల్లోనే మరో వర్గానికి టికెట్‌ ఇవ్వాల్సి వస్తే వనితకు అక్కడ అవకాశం ఉండకపోవచ్చు. సాలూరులో రాజన్నదొరకే మళ్లీ టికెట్‌ దక్కనుంది. అయితే ఈ సారి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

వీరి సంగతి తేలాలి

నగరిలో మంత్రి రోజాకు పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు టికెట్‌ ఇస్తారా.. లేదా అన్నది తేలాలి. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టికెట్ల విషయం నిర్ణయించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో.. జ్ఞానేంద్రరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో నారాయణస్వామి టికెట్‌ విషయం ఏమవుతుందో చూడాలి. మేరుగు నాగార్జున ఈసారి వేమూరులో కాకుండా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. అంబటి రాంబాబు ఈసారి మళ్లీ సత్తెనపల్లి నుంచే పోటీచేస్తానని ధీమాగా చెబుతున్నారు.

అయితే పార్టీలో ఆయనకు సానుకూల పరిస్థితులు లేవు. సత్తెనపల్లిలో ఓ ప్రధాన వర్గం నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు టికెట్ల విషయం కూడా తేలాలి. తెదేపా-జనసేన పొత్తు వీరి స్థానాలపై ప్రభావం చూపనుంది. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురంలో వైకాపా ముఖ్యనేతలు ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈసారి రామచంద్రపురంలో తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని బోస్‌ గట్టిగానే పట్టుబట్టారు. ఈ పంచాయితీ సీఎం వరకూ వెళ్లడంతో రామచంద్రపురం టికెట్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z