ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో శారీరక/లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇందులో ఆగ్నేయాసియాది రెండో స్థానమని తెలిపింది. హింసరహిత జీవనం ప్రతి ఒక్కరి హక్కుగా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. మహిళలపై హింసాత్మక ఘటనల్ని నిరోధించవచ్చని ఉద్ఘాటించింది.
జీవిత భాగస్వాములతోనే ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. జీవిత భాగస్వాముల వల్ల కలిగే ఇటువంటి భౌతిక, లైంగిక హింస తక్షణం ప్రభావం చూపడంతోపాటు దీర్ఘకాలంలోనూ ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. ఇందులో శారీరక గాయాలతోపాటు మానసిక, సంతాన సమస్యలు, ప్రణాళిక లేని ప్రెగ్నెన్సీ, హెచ్‌ఐవీ వంటి సమస్యలూ ఉండే అవకాశం ఉందన్నారు. ఇలా మహిళలపై జరుగుతోన్న హింసను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే, ఐక్యరాజ్యసమితి ఏటా నవంబర్ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఈసారి 16రోజులపాటు అవగాహనా కార్యక్రమాలను చేస్తోంది. మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ 10వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
👉 – Please join our whatsapp channel here –