డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఈ మధ్యకాలంలో ట్రెండ్‌గా మారింది. సంపన్నులు ఎంతో ఖర్చు చేసి ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్ అంటూ ఇలా తమకు నచ్చిన దేశాలకు వెళ్లి వివాహం చేసుకుంటారు. అయితే, ఓ తండ్రి మాత్రం అందుకు భిన్నంగా తన కుమార్తె వివాహాన్ని విమానంలో జరిపించాడు. ఈ ఘటన దుబాయ్ (Dubai)లో చోటు చేసుకొంది.
భారత్‌కు చెందిన దిలీప్ పోప్లీ అనే వ్యక్తి యూఏఈలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఆయన కుమార్తె విధి పోప్లీ వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. అందుకు ప్రైవేట్ జెటెక్స్ బోయింగ్ 747లో ఏర్పాట్లు చేశారు. వరుడు హృదేశ్ సైనాని పెళ్లి దుస్తులు ధరించి బ్యాండ్ బారాత్‌తో డాన్స్ చేస్తూ విమాన రన్‌వే వరకు వచ్చారు. ఈ వేడుకకు 300 మంది అతిథులు హాజరయ్యారు. వధూవరులు, అతిథులతో విమానం దుబాయ్ ప్రైవేట్ టెర్మినల్ నుంచి ఒమన్‌కు బయలుదేరింది. విమానం గగనతలంలో ఉండగానే ఈ జంట వివాహంతో ఒక్కటైంది.
మూడు గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో వారి ఆనందం అంబరాన్ని తాకింది. అతిథుల కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. అంతేకాకుండా, విమానంలోని వారంతా వేడుకను వీక్షించేలా ప్రోజెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. వేడుక అనంతరం విమానం ఒమన్‌లో ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దిలీప్ పోప్లీ 1994లో తన వివాహాన్ని ఓ విమానంలోనే చేసుకున్నారట. ‘‘వెడ్డింగ్ ఇన్ ది స్కై. ఇది మా నాన్న ఆలోచన. నా వివాహాన్ని గాల్లో జరిపించాలనేది ఆయన కల. గతంలో ఎయిర్ ఇండియా ఛైర్మన్ అనుమతితో ఎయిర్‌బస్ A310లో నా పెళ్లి జరిగింది’’ అని దిలీప్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –