* శాంసంగ్ గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) తన ‘ఏ’ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఏ05 (Samsung Galaxy A05 ) పేరిట ఈ మొబైల్‌ని విడుదల చేసింది. మొబైల్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. గెలాక్సీ ఏ05 (Samsung Galaxy A05 ) ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా పేర్కొంది. బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ స్కిన్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ అమర్చారు. అదనంగా 6జీబీ మెమోరీని జోడించే సుదపాయాన్ని కల్పించారు. ఫోన్ వెనక 50ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో పాటూ అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్ కింద రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ని కూడా అందించనుంది. శాంసంగ్ ఫైనాన్స్+ ద్వారా కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం పొందొచ్చని కంపెనీ పేర్కొంది. వీటికి అదనంగా నెలకు రూ.875 నుంచి ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.
* ఉచితంగా నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్, జియోలు యూజర్లకు శుభవార్త చెప్పాయి. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా ప్రీపెయిడ్ ప్లాన్ బండిల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.. ఈ ఏడాది ప్రారంభంలో జియో సైతం ఈ తరహా రీఛార్జ్ ప్లాన్‌లను యూజర్లకు అందించగా.. ఎయిర్‌టెల్ తాజాగా సబ్‌స్క్రిప్షన్ బండిల్స్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్, జియోలు దేశంలో 5జీ సేవల్ని అందిస్తున్నాయి. అయితే కస్టమర్ల కోసం ఈ రెండు సంస్థలు కలిసి నెట్‌ఫ్లిక్స్ బండిల్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుండగా.. వాటిల్లో నెట్‌ఫ్లిక్స్‌ని ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించాయి. ఇక ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ల విషయానికొస్తే..84 రోజుల వ్యాలిడిటీతో రూ.1499 విలువైన ప్లాన్‌లో ప్రతి రోజు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. 5జీ సేవలున్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న ప్లాన్‌ను ఉపయోగిస్తే 5జీ కంటే ఎక్కువ డేటా పొందవచ్చు. కొత్తగా విడుదల చేసిన ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ సైతం వినియోగించుకోవచ్చు. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్, టీవీ ఇలా ఏదైనా ఒక డివైజ్‌లో ఓటీటీ సేవల్ని పొందొచ్చు. ఉచితంగా ఎయిర్‌టెల్ హలోట్యూన్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. మరోవైపు జియో అందిస్తున్న రెండు ప్లాన్‌లలో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించవచ్చు. అందులో ఒక ప్లాన్ ఖరీదు రూ.1,099 ఉండగా ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. మరో ప్లాన్ రూ.1,499లో ప్రతి రోజు 3జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.ఈ రెండు జియో ప్లాన్‌లలో ముందుగా చర్చించిన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ ప్లాన్ మాదిరిగానే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఒక్కొక్కటి 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. జియో ప్లాన్‌లు రోజువారీ డేటా ప్యాక్‌తో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది.
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కనిపించాయి. గతవారం వరుస రెండు సెషన్లలో నష్టపోయిన సూచీలు, ఒకరోజు సెలవు తర్వాత మంగళవారం ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం తక్కువ లాభాలతో మొదలైన సూచీలు ఓ దశలో నష్టాలకు జారాయి. మిడ్-సెషన్ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు అనంతరం ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాలకు మారాయి.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 204.16 పాయింట్లు లాభపడి 66,174 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 19,889 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రా సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఐటీసీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.33 వద్ద ఉంది.
* భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి
అధిక ఆహార ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల), బలహీన ఎగుమతుల వంటి అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొంటున్న భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధించవచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం ప్రకటించింది. ఈసారి మనదేశం ఆరు శాతం గ్రోత్ సాధిస్తుందని ఈ సంస్థ గతంలో ప్రకటించగా, ప్రస్తుతం దానిని పెంచింది. రాబోయే ఆర్థిక సంవత్సరం (2024-–25) వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. హయ్యర్ బేస్ వల్ల వృద్ధి తగ్గుదల, గ్లోబల్ గ్రోత్ నెమ్మదించడం, వడ్డీ రేట్ల ప్రభావం ఇందుకు కారణాలని పేర్కొంది. ఎస్ అండ్ పీ అంచనాలు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీల కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఫిచ్ అంచనా వేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. మార్చి 2023తో ముగిసిన 2022–-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి చెందింది. మార్చి క్వార్టర్లో 6.1 శాతంగా ఉన్న దేశ వాస్తవ జీడీపీ జూన్ క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం పెరిగింది. ఇన్ఫ్లేషన్ను తగ్గించడానికి ఆర్‌బీఐ గత ఏడాది మే నుంచి బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఫిబ్రవరి నుంచి రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. అధిక డిమాండ్ కారణంగా భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆర్థిక వ్యవస్థలలో ఈ సంవత్సరం, తదుపరి సంవత్సరం వృద్ధి పటిష్టంగా ఉంటుందని ఎస్ అండ్పీ తన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో పేర్కొంది. దీని ప్రకారం.. భారతదేశంలో ప్రైవేట్ వినియోగదారుల ఖర్చు కంటే స్థిర పెట్టుబడులు వేగంగా పుంజుకున్నాయి. మనదేశంలో -సెప్టెంబర్ క్వార్టర్లో ఆహార ఇన్ఫ్లేషన్లో తాత్కాలిక పెరుగుదల ఉంది. ఇప్పటికీ, హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది.
* జుకర్ బర్గ్ ఉదయం 8 గంటలకు నిద్ర లేస్తారట!
ప్రపంచ కుబేరులు తమ రోజును ఎలా ప్రారంభిస్తారు. ఏలాంటి ఆహారం తీసుకుంటారు.. నిద్ర పోయేవరకు అసలు ఏం చేస్తుంటారు అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. టెక్ దిగ్గజం, మెటా సీఈవో జుకర్ బర్గ్ (Mark Zuckerberg)తన రోజువారీ దినచర్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిద్ర లేవగానే ఫోన్ చూడడంతో తన రోజు మొదలవుతుందని తెలిపారు. ఫేస్‌బుక్ లైవ్ సేషన్‌లో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. జుకర్ బర్గ్ ఉదయం 8 గంటలకు నిద్ర లేస్తారట. ‘‘ఉదయం నిద్ర లేవగానే ముందుగా నా ఫోన్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తా. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటా. నిజం చెప్పాలంటే నాకు లెన్స్ లేకపోతే సరిగా కనిపించదు. ఇలా చేయడం తప్పని తెలిసినా.. ఫోన్ చూస్తుంటా’’ అని బర్గ్ తెలిపారు. అయితే, వారంలో 50 నుంచి 60 గంటలు తన కంపెనీ కోసం పని చేస్తానని జుకర్ తెలిపారు. మిగిలిన సమయాన్ని తన కుటుంబంతో గడిపేందుకు.. కంపెనీ భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు కేటాయిస్తానని అన్నారు. పని ఒత్తిడి నుంచి రీసెట్ అయ్యేందుకు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోతానంటూ వెల్లడించారు. జుకర్‌కి ముగ్గురు కుమార్తెలున్నారు. వారితో కలిసి ప్రముఖ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పాటలు వినడం.. వాటిని సాధన చేస్తుంటారని ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ గతంలో తెలిపారు. టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్‌తో కేజ్‌ఫైట్‌కు సిద్ధమవుతున్న జుకర్ శిక్షణకు ఎంత సమయం కేటాయిస్తారో వెల్లడించారు. వారానికి మూడు రోజులు జాగింగ్‌కు.. మిగిలిన రోజులు జియు-జిట్సు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఈ) శిక్షణకు సమయం వెచ్చిస్తానని తెలిపారు. ఇక ఆహార విషయానికొస్తే.. 4 వేల కేలరీలు తన ఆహారంలో ఉండేలా చూసుకుంటానని తెలిపారు. కఠినంగా ఉండే ఈ శిక్షణ కోసం ఇంత మొత్తంలో కేలరీలను తీసుకుంటున్నట్లు జుకర్ పేర్కొన్నారు. అయితే, ఎలాంటి ఆహారం తీసుకుంటారో మాత్రం వెల్లడించలేదు.
👉 – Please join our whatsapp channel here –