భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్‌దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. హుబ్బళ్లికి చెందిన మహిళకు 2005లో వివాహమైంది. కుమార్తె పుట్టాక దంపతులు విడిపోయారు. కుటుంబ న్యాయస్థానం ఆదేశానికి అనుగుణంగా భరణాన్ని తన మాజీ భర్త ఇవ్వడం లేదని గృహిణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన ఆధార్ కార్డు వివరాలను తెలియజేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్)కు విన్నవించారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలు ఇవ్వలేమని 2021 ఫిబ్రవరి 25న దరఖాస్తును ఉడాయ్ తిరస్కరించింది. సంస్థ నిర్ణయంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు ఆధార్ వివరాలు అందించాలని హైకోర్టు.. ఉడాయ్‌ను 2023 ఫిబ్రవరి 8న ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై ఉడాయ్ మళ్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్ నంబరు, ఇతర వివరాలను తెలియజేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిందని సంస్థ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉడాయ్‌కు అనుకూలంగా ధర్మాసనం తీర్పునిచ్చింది.
👉 – Please join our whatsapp channel here –