తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ నటి ప్రగతి (Pragathi) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పంచుకుంటూ ఉంటారు. ఆమె నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు.
తాజాగా బెంగళూరులో 28వ పురుషులు,మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఇందులో నటి ప్రగతి పాల్గొని మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెంగళూరులోని ఇంజనీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఇవి జరిగాయి. ఎంతో మంది పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకాన్ని సాధించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. జీవితం ముగిసిందని ఎన్నోసార్లు భావించాను. కానీ, ఇలాంటివి నాకు ఉత్సాహాన్నిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాలన్నది జీవితానికి విజయ మంత్రం’ అని పేర్కొన్నారు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన వారు ఆమెను అభినందిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ప్రగతి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో 100కు పైగా చిత్రాలతో మెప్పించారు. చిరంజీవి హీరోగా ఇటీవల వచ్చిన ‘భోళాశంకర్’లో కనిపించారు.
👉 – Please join our whatsapp channel here –