రాజ్‌కరణ్ బారువా (56).. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నగరంలో రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. దాదాపు రిటైర్మెంటు వయసుకు దగ్గరైనా చదువుపై జిజ్ఞాసను వీడకపోవడం రాజ్‌కరణ్ ప్రత్యేకత. 1996లోనే పురాతత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈయనకు గణితశాస్త్రంలో ఆ ఘనత సాధించాలన్నది తీరని కోరికగా ఉండేది. బతుకు పోరులో జీవితం ఎన్నో పరీక్షలు పెట్టినా మనసులోని ఆకాంక్షను అలాగే సజీవంగా ఉంచుకొన్న రాజ్‌కరణ్ 23 విఫల యత్నాల తర్వాత ఇటీవల డబుల్ పీజీ పూర్తి చేశారు. జబల్‌పుర్‌లోని రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయం నుంచి ఈ ఏడాది తన రెండో మాస్టర్ డిగ్రీ ఎమ్మెస్సీ ఇన్ మ్యాథ్స్‌ను ఆయన సాధించారు. ‘‘ఈ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. రాత్రిళ్లు యజమానులు కేక వేసినపుడు నేను మెట్లపై కూర్చొని చదువుకోవడం చూసి కొంతమంది కటువుగా మాట్లాడేవారు. నా రెండో ప్రయత్నంలో ఒక సబ్జెక్టు మినహా మిగతా అన్నింటిలో వరుసగా పరీక్షలు తప్పుతూ వచ్చాను. చివరకు సాధించాను. నా యజమానులు చదువు విషయంలో వారి పిల్లలపై కేకలు వేయడం చూశా. ఏ సదుపాయాలు లేని నేనే సాధించినపుడు.. వారెందుకు సాధించలేరు?’’ అని ప్రశ్నిస్తారు రాజ్‌కరణ్. అవివాహితుడిగా మిగిలిపోవడం గురించి స్పందిస్తూ.. ‘‘నేను నా కలలను పెళ్లాడాను’’ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –