టీవీ చర్చలో కమలం నేత జవదేక్ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఈసారి తెలంగాణలో కమలం వికాసాన్ని ఎవరూ ఆపలేరు? మేం 320 సీట్లలో విజయం సాధించబోతున్నాం అని మైకును గుద్ది చెప్పారు.
సార్ తెలంగాణలో ఉన్నవే 119 సీట్లు….
అంటే అధికార పక్షం సీట్లను కూడా కొట్టేశారా?
కొట్టేయడం కాదు సార్ 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో 119 సీట్లే ఉన్నాయి .
అంటే మిగిలిన 250 సీట్లు ఆంధ్రాలో ఉన్నాయా?
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవే 294 సీట్లు. అందులో తెలంగాణలో 119 ఉంటే, ఆంధ్రాలో 175 సీట్లు.
నిజమా ?
ఔను సార్ రాష్ట్ర విభజనను, తెలంగాణ ఏర్పడడాన్ని మీరూ, మీ పార్టీ, మీ మోడీ ఇంకా జీర్ణం చేసుకోలేదు కాబట్టి రాష్ట్ర విభజన జరిగిందని కానీ, తెలంగాణ ఏర్పడిందని కానీ మీకు గుర్తులేదు.
పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు తెలంగాణకు ఏం చేశారో చెబుతారా?
ఇంటింటికీ మంచి నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ తాత్కాలికమైనవి.. వీటిపై మాకు నమ్మకం లేదు.
అంటే అన్ని రాష్ర్టాలకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినట్టు తెలంగాణకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటిస్తారా?
ఈ ప్రాజెక్ట్‌లు కూడా శాశ్వతమైనవి కాదు. మేం శాశ్వతంగా ఉండే వాటిపైనే దృష్టి పెడతాం.
మేం ఊహించలేక పోతున్నాం. తెలంగాణకు ఇచ్చే శాశ్వతమైనవేవో మీరే చెప్పండి ?
పుట్టిన మనిషి గిట్టక తప్పదు.. పుట్టాడు అంటేనే గిట్టే రోజు రాసి పెట్టుకొని వచ్చాడు అని అర్థం.
ఔను..మరి శాశ్వతం?
ఆత్మ శాశ్వతమైంది.. ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తే ఏమవుతుంది. అప్పటికప్పుడు దాహం తీరుతుంది. ఓ గంట అయ్యాక మళ్ళీ దాహం వేస్తుంది.
ఊరించకండి చెప్పండి?
ఆత్మ శాశ్వతమైనది.. మేం ఆత్మకు శాంతి కలిగే పనులు చేస్తాం.
సరే అవయినా చెప్పండి?
ఆత్మ కనిపించదు. మేం చేసేదీ మీకు కనిపించదు .
అంటే చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు అంటారు. మరి మీరు ఎలా గెలుస్తారు ?
రాంజెఠ్మలానీ, సీతారాం ఏచూరి, హిందూ ఎడిటర్ రామ్.. వీరంతా మమ్ములను తీవ్రంగా వ్యతిరేకించారు. ఐనా వీరి పేరులో రామ్ ఉంది..
ఉంటే ?
రామ్ పేరున్న వాళ్లంతా మా పార్టీకే ఓటు వేస్తారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా రాం పేరున్న వారు కనిపిస్తారు. మా గెలుపునకు ఇదే ఆధారం.
ఇదేం వాదన. ఐనా రామ్ పేరున్న వాళ్లంతా మీకే ఓటేస్తారా? వేసినా గెలవడానికి సరిపోతాయా?
ఆత్మను నమ్మిన వాళ్లంతా మాకే ఓటేస్తారు. ఎందుకంటే ఆత్మల గురించి ఇప్పటి వరకు ఏ పార్టీ పట్టించుకోలేదు. మేం మాత్రమే పట్టించుకున్నాం. ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చేయలేదు అని చెప్పకుండా ఆత్మలను నమ్ముకున్నాం.’
జనం మా గురించి ఏమనుకుంటున్నారు ?
ఆత్మల ప్రచారాన్ని నమ్మి మీకు ఓటేస్తే ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –