అమెరికాలోని ఆసుపత్రులపై సైబర్ దాడి (Cyber Attack) జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది. న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామా రాష్ట్రాల్లోని 20కిపైగా ఆసుపత్రుల్లో అర్డెంట్ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ వైద్య సేవలు, ఇతర సదుపాయాలను అందిస్తోంది. తాజాగా ఆయా ఆస్పత్రుల్లోని మెడికల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో ఆసుపత్రుల్లోని క్లినికల్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన సంస్థ.. సాఫ్ట్‌వేర్ సేవల్ని పునరుద్ధరించడానికి తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అప్పటి వరకు సాధారణ వైద్యసేవలు కొనసాగుతాయని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ గదుల్లో ఉన్న రోగులకు మాత్రం ఇతర ఆస్పత్రులకు తరలించామని తెలిపింది. అత్యవసర పరిస్థితి లేని శస్త్రచికిత్సలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ సైబర్ దాడిలో ఎలాంటి సమాచారం చోరీకి గురైందో ఇప్పుడే చెప్పలేమని, దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నామని అర్డెంట్ కంపెనీ వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –