Agriculture

ఆ పార్టీ నేతల తీరుపై రైతులు ఆగ్రహం

ఆ పార్టీ నేతల తీరుపై రైతులు ఆగ్రహం

వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ అందుతున్నది. దీంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్‌, రాత్రి పూట పొలాల్లో పడిగాపులు, ఎరువులు, విత్తనాల బాధలు, ధాన్యం కొనుగోళ్ల కష్టాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల జీవితాల్లో నిప్పులు పోసేందుకు కాంగ్రెస్‌ కంకణం కట్టుకున్నది. 24 గంటల కరెంట్‌ అవసరం లేదని, 10 హెచ్‌పీ మోటర్లు కొనుక్కుంటే 3 గంటలు చాలని అంటున్నది. దీనిపై రైతులు భగ్గుమంటున్నారు. 10 హెచ్‌పీ మోటర్లకు అయ్యే ఖర్చు ఎవడిస్తడని నిలదీస్తున్నారు. నాడు కాంగ్రెస్‌ పాలనలో రాత్రిపూట కరెంటు కోసం పడిగాపులు కాసి కరెంట్‌ షాక్‌, పాము, తేలు కాట్లతో ఎంతో మంది రైతులు చనిపోయిన ఘటనలు ఇంకా మర్చిపోలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.రైతుల భూములకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భూములపై రైతులకు సర్వహక్కులు సమకూరాయి. అలాంటిది కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థతో పడిన కష్టాలు చాలని, మళ్లీ అలాంటి ఇబ్బందులు పడలేమని పేర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌తో భద్రంగా ఉన్న భూములను మాయం చేయాలని చూసే కాంగ్రెసోళ్లకు ఓటుతోనే బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.

సాగు నీరు లేక బీడు ఉండేవి

కరెంట్‌ కష్టాలతో 55 ఏండ్లు ఎన్నో బాధలు పడ్డాం.సాగు చేసుకోవడానికి భూములు ఉన్నా కరెంట్‌ సాగు నీరు లేక బీడు ఉండేవి. సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్‌తో రెండు పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు వ్యవసాయానికి కరెంట్‌ మూడు గంటలే చాలు అంటున్నారు.10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొంటే సరిపోతుందని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి వారికి అధికారమిస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారు.వ్యవసాయం గురించి,రైతుల బాధల గురించి తెలిసిన సీఎం కేసీఆర్‌ సారుకే మా మద్దతు తెలుపుతాం.రైతు బంధు, రైతు బీమా,రుణమఫీ,24 గంటలపాటు కరెంట్‌ ఇచ్చి రైతులకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం.

కాంగ్రెసోళ్లు వస్తే ఎవుసం బంద్‌ చేసుకోవాలే

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎవుసం బంద్‌ చేసుకోవాల్సిందే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్‌ చాలు అంటున్నడు. వ్యవసాయరంగానికి ఎలా సరిపోతుందో ఆయనే సమాధానం చెప్పాలి. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయిస్తున్నారు. ఇప్పుడు ఏబాధలు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం. సమయానికి రైతుబంధు కూడా వస్తుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులందరూ అండగా ఉంటారు.

కాంగ్రెస్‌ హయాంలో అన్నీ కష్టాలే..

కాంగ్రెస్‌ హయాంలో కష్టాలు తప్పలేదు. కరెంట్‌ సక్కగ లేక మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేది. సుమారు 50 మందికి పైగా దుబాయి బాట పట్టాం. దుబాయ్‌లో పని చేసుకుంటూ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చివెళ్లేది.వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులను చూస్తే చాలా సంతోషం అనిపించేది. సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం వరకే ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ పనులు మొదలు పెట్టారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. దుబాయికి వెళ్లిన వారంతా పల్లెలకు వచ్చాం. నిజంగా ఇదంతా ఆలోచించుకుంటే ఇది కలనా నిజమా అని ఇప్పటికీ నమ్మలేక పోతున్నా. కేసీఆర్‌ సారు ఎప్పుడూ చరిత్రలో నిలిచే పనులు చేశాడు. ఆయన మా లాంటి బాధితులకు దేవుడు.

కాంగ్రెస్‌ను నమ్మితే చీకటి రాజ్యమే

సిద్దిపేట కమాన్‌, నవంబర్‌ 29 : కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మితే రైతులకు చీకటి రాజ్యం ఖాయం. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు బాగా తిరుగుతున్నారు. రైతులు గోసపడ్డప్పుడు ఏం చేయలేదు. కరెంట్‌ గోసనైతే చెప్పరాంది. ఎట్ల చేసినమో ఏమో ఎవుసం. ఆ రోజులు యాదికొస్తే పాణం జల్లుమంటది. ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ మీద 30 నుంచి 40 కనెక్షన్లు ఉండేది. మోటర్లు అస్సలుకే నడవకపోవు. ఊకే కాలిపోతుండే. వచ్చిన పంట దానికే పెట్టుడైతుండే. ఇప్పుడు కూడా మూడు గంటల కరెంట్‌ చాలంటున్నారట. అస్సలెట్ల సరిపోతదో ఏమో వాళ్లకే తెలువాలి. పెద్ద మోటర్లు (10 హెచ్‌పీ) పెట్టమంటున్నారట. కూరగాయలు, ఆకుకూరలు పారిస్తే చిన్న చిన్న కాల్వలే ఉంటాయి. పెద్ద మోటర్లు పెడితే కాల్వలు ఉంటాయా.. ? ఏం చెప్పుడో ఏమో.. కాంగ్రెస్‌ పాలనలో ఎవుసం చేసుడు ఇబ్బంది ఉండే. వారికి నచ్చిన రీతిన కరెంట్‌ వచ్చేది. పారియడం తిప్పలయ్యేది. కరెంట్‌, నీళ్ల గోసతో పంటలు కూడా బాగా రాకపోయేవి. కరెంట్‌ లేక వరిపొలాలు ఎండిపోతుండే. కరెంట్‌ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని అయోమయం ఉంటుండే. కాంగ్రెస్‌ని నమ్మితే మళ్లీ చీకటి రాజ్యమే అవుతుంది.

10హెచ్‌పీ మోటరు ఎవడు ఇస్తడు..

10హెచ్‌పీ మోటరు ఎవడు ఇస్తాడు. దానికి కరెంట్‌ ఎవడు ఇస్తాడు. మునుపటి రోజుల లెక్కన మళ్లీ మోటర్లు కాలుడే ఉంటది. తెల్లందాక బాయిలకాడ పండుకోవాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థంకావడం లేదు. మళ్లీ వాళ్లు వస్తే రైతులను గోస పెట్టడం ఖాయం. చెప్పేది ఏదో సక్కగ చెప్పాలి. ఈ డొంక తిరుగుడు ఎందుకు. రైతులను ఇబ్బంది పెడితే కాంగ్రెస్‌ నాయకులుకు బుద్ధిచెబుతాం.

ఐదు గంటల కరెంట్‌ ఇస్తే ఎవుసం ఎలా..

ఐదు గంటల కరెంట్‌ ఇస్తే రెండు దొయ్యలు కూడా పారవు. 24గంటల కరెంట్‌ ఇస్తేనే మంచిగుంటది. ఐదుగంటల కరెంట్‌ ఎందుకు పనికిరాదు. మళ్లీ మునుపటిరోజులే వస్తాయి. ఎందుకు ఇస్తామని చెబుతున్నారో అర్థంకావడం లేదు. ఐదు గంటల కరెంట్‌ ఏం చేసుకోవాలి. ఎందుకు అక్కరకు రాదు. రైతులు ఆలోచించాలి. మళ్లీ మోటర్లు కాలుడు. రాత్రి బాయిలకాడ జాగారం చేయాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రైతు గోస తెలువది.

ధరణితోనే భూములు పైలంగా ఉన్నయి
కాంగ్రెస్‌ నాయకులు ధరణి తీసేసి ఇంకా ఎదో తెస్తరంటా.. రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ధరణి ఉన్నంక మల్లా ఇంకొంటి ఎందుకు. ఇప్పుడైతే భూమికి ఇవరాలు కంపుటర్‌ షాపులో అడిగే జల్దిగానే ఇస్తుండ్రు. గిదంతా గా పెద్ద సారు కేసీఆర్‌ తెచ్చిన ధరణి వల్లే. ధరణితోనే భూములు పైలంగా ఉన్నయి. కాంగ్రెస్‌ నాయకులు పాత కాలం నాటి పట్వారీ వ్యవస్థ తీసుకొస్తానని అంటుర్రు. అందులో కౌలుదారు కాలమ్‌ ఉంటదట. దీనివల్ల తమ భూములను కౌలుకు ఇచ్చిన భూ పట్టదారులు ఎప్పుడు భయంగానే బతుకాలే. ఇదంతా రిస్కు ఎందుకని భూ పట్టదారులు తమ భూములను ఖాళీ ఉంచుతరు తప్ప కౌలు రైతులకు ఇవ్వరు. సాగు దిన దినం తక్కువైతది. మల్లా తిండి గింజలు లేక కరువు కాలం వస్తంది.

ధరణి తీసేస్తే పట్వారీలదే అధికారం

ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాతే క్షణాల్లో రిజిష్ట్రేషన్‌ అయిపోతుంది. వెంటనే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వ్యక్తి పేరున పట్టా మార్పు వివరాలతో పహాణీలో భూ వివరాలు వస్తాయి.. కాబట్టే భూమి విలువ పెరిగింది. అంతే కాక క్షణాల్లో అమ్మిన రైతు నుంచి పట్టాపాస్‌ బుక్‌ లో నుంచి తేసివేయబడుతుంది. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మళ్లీ అమలు కోసం రిజిస్ట్రేషన్‌ పేపర్లు పట్వారీకి అందజేస్తే కొన్నేండ్లు తిరిగినా అమలు చేయలేక మాటమాటకు లంచం వసూలు చేసి రైతులను పిడించేవారు.. ఈ విధంగా పట్వారీ వ్యవస్థ ఉందని మొత్తం పట్వారీలను తొలిగించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రైతులు అప్పుల బాధతో ఉంటే మొత్తం పొలాన్ని అమ్మినా తీరని అప్పు, కేవలం గుంట భూమితో తీరుతుంది. ఒక వేల ఈ ధరణి పోర్టల్‌ తీసేస్తే పెట్టుబడి సాయం అందక పంటలు తక్కువగా పండిస్తారు. అంతేకాక సాగు విస్తీర్ణం పడిపోయి మళ్లీ రైతు వలసలు షురూ అవుతాయి.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులు ఆగం

గుంట భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు,రైతు బీమా వర్తింపజేస్తున్నది. కాంగ్రెస్‌ నాయకులు కౌలు రైతుల పేరుతో మోసం చేసేందుకు కుట్రపన్నుతున్నారు. రైతు భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టి కౌలు రైతులకు వర్తింపజేస్తామని చెబుతున్నారు. కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడంలేదు. కాంగ్రెస్‌ నాయకులు మూడు గంటల విద్యుత్‌ వ్యవసాయరంగానికి చాలని చెప్పడం ఎంతవరకు సమంజసం. ప్రజలు ఆపార్టీని నమ్మే పరిస్థితిలేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏమీచేయలేదు.వాళ్లు కేవలం ఓట్లకోసం పథకాలు పెడతారే తప్పా వాటిని అమలు చేయరు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేసి భూ మాత పోర్టల్‌ తీసుకువస్తామంటున్నారు. అందులో కౌలు రైతులకు అనుకులంగా కాలం పెడతామని చెబుతున్నారు. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు చేస్తే రైతులకు కష్టాలు తప్పవు.

రైతులను అప్పులపాలు చేయడానికే కుట్ర

కాంగ్రెసోళ్లు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్‌ చాలంటున్నారు. మూడు గంటల కరెంట్‌ ఎట్లా సరిపోతది. ఆకరెంట్‌తో మూడు గుంటల భూమి తడ్వదు. ఆపార్టీ వాళ్లు అధికారంలోకి వస్తమని పగటి కలలు కంటున్నారు.వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో మోసపూరిత హామీలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్టాం.కరెంట్‌ లేక వ్యవసాయం చేసుకోలేదు. అప్పటి కరెంట్‌తో మొదటి మడి కూడా తడువకుండే.తెలంగాణ స్వరాష్ట్రంలో రోజూ 24 గంటల పాటు కరెంట్‌ ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.మంచిగా పంటలు పండించుకొని ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నారు.కరెంట్‌,వ్యవసాయం గురించి అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు రోజూ ముడు గంటల కరెంట్‌ చాలు అనడంతో వారికి రైతుల పట్ల ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది. మూడు గంటల కరెంట్‌ అన్న కాంగ్రెస్‌ను ముడు చెరువుల నిళ్లు తాగించాలి

మళ్లీ దోపిడీ రాజ్యానికి తెర

కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ దోపిడీ రాజ్యానికి తెరలేపుతది. ధరణి వచినప్పుటి నుంచి భూముల లొల్లి బంద్‌ అయి, ఎవలి భూములు వాళ్ల చేతుల్లో భద్రంగా ఉన్నాయి. అంతకుముందు అయితే పట్వారీలు, గిర్ధావరులు పైసలు తీసుకొని తెల్లారే వరకు ఒకరి భూములు మరో వ్యక్తి పేరుమీద రాసేది.మొఖ మీద ఒకలు ఉంటే, కాగితాల్లో(రికార్డులో) ఒకరు ఉండేది. భూములు లొల్లితోని కోర్టుల చుట్టూ తిరిగేది. కానీ, ధరణి వచ్చిన తర్వాత భూముల గొడవలు కూడా తగ్గిపోయాయి. పక్కాగా ఎవలకు ఎంత భూమి ఉండాలే అనే లెక్క కూడా తేలింది. అమ్మితే, కొంటేనే తప్పా భూమి మారేదీ లేదు. ధరణి ఇంత మంచిగా ఉంటే వద్దు అంటున్న కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ రైతుల మధ్య భూముల లొల్లి పెట్టి ఆగం చేసేందుకు తయారయ్యారు. కాంగ్రెస్‌ను ఒప్పుకునేదీ లేదు. కాంగ్రెసోళ్లకు ఓటు వేస్తే బతుకులు ఆగం అవుతాయి. కాంగ్రెస్‌ హయాంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. రికార్డులు మాయం చేసి సామన్య రైతులను మోసగించారు. అరచేతిలో భూమి వివరాలు ఎప్పటికప్పుడు తెలుకునేందుకు ధరణి రైతులకు ఆయుధం లాంటిది. సీఎం కేసీఆర్‌ చేసిన గొప్ప పనులు గతంలో ఏనాయకుడు కూడా చేయలేదు.

ఇప్పుడే రైతులు బాగుపడుతున్నారు

ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతున్నారు. ఉచిత కరెంట్‌తో పంటలు పండుతున్నాయి. కాంగ్రెస్‌ వస్తే రైతులు పొలాలకాడ జాగారం చేసుడే అయితది. పాలన చేతగాని కాంగ్రెస్‌తో కరెంట్‌ ఇచ్చుడు కాదు. మాటలు మస్తుగా చెబుతారు చేతల్లో చూపాలి. తెలంగాణ వచ్చిన తర్వాత అంతా చీకటి అయితది అన్నారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ఎక్కిరిచిర్రు. ఇప్పుడు మంచి పనులు చేస్తే ఖర్సు ఎక్కువైందని అంటుర్రు. ఆదాయం పెరిగింది. పుట్లకొద్ది ధాన్యం కేంద్రాలకు వస్తున్నాయి. గి వడ్లను కొనుడు కాంగ్రెస్‌కు అయితదా. పైసలు టైంకు ఇయ్యరు. గతంలో కాంగ్రెస్‌ పాలన చూసినం. ఎట్ల ఉన్నదో మాకు ఎరుకే.

24 గంటల కరెంట్‌ ఇస్తుండ్రు. రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి శనిలా పట్టిండు. రోజు టీవీల్లో తిట్టుడు తప్పా చేసేది ఏమీ లేదు. ఏదిపడితే అది మాట్లాడుడు నేర్సుకున్నరు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే గతంలో పట్టించుకునే నాథుడే లేడు. కరెంట్‌ ఎప్పుడు వస్తదో తెల్వకపోయేది. గసొంటి పాలన నుంచి కేసీఆర్‌ విముక్తి తెచ్చిండు. లొల్లి లేని పాలన మంచిగుంటది. కాంగ్రెస్‌ అంటే పైరవీలు. ఏ పని కావాలన్నా పైరవీ చేస్తే అయితది. రైతులను పట్టించుకునే నాయకులను జనం మర్చిపోరు.

మూడు గంటల కరెంట్‌ అంటే మళ్లీ ఆగమే

మూడు గంటల కరెంట్‌ అంటే మళ్లీ ఆగమే. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్‌ మంచిగా వస్తుంది. తొమ్మిదేండ్లుగా పంటలు మంచిగా పండుతున్నాయి. నాలుగు పైసలు వస్తున్నాయి.కడుపునిండాతింటున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిరాకారంలోకి వస్తే మూడు గంటల కరెంట్‌ ఉంటుంది. మూడు గంటల కరెంట్‌ వస్తే నారు మడి కూడా పారదు .వ్యవసాయం ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు.బీఅర్‌ఎస్‌ ప్రభుత్వం పంట పొలాలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తుంది. 5 హెచ్‌పీ మోటర్లను వాడుతున్నాం కాంగ్రెస్‌ నాయకులు మూడు గంటల కరెంట్‌ ఇచ్చి 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటున్నాడు. అంత డబ్బ ఎవరు ఇస్తారు. కాంగ్రెస్‌ మాటలు నమ్మితే పాత రోజులే వస్తాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని మాయమటలు చెబుతున్నారు. మూడు గంటల కరెంట్‌ వద్దు … కాంగ్రెస్‌ వద్దు… బీఅర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటేనే రైతులకు మంచిగా ఉంది.

రైతులకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

గిప్పుడైతే కరెంట్‌ మంచిగనే ఉన్నది. వ్యవసాయానికి మూడు గంటలు చాలని బుద్ధి ఉన్నడో ఎవడైనా అంటాడా. మాకు అయితే సరిపోదు. నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. మూడు గంటల కరెంట్‌ సరిపోదు. రైతులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం. రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలు అన్నీ అబద్ధాలే..రోజూ పేపర్లో చూస్తున్నాం. మొన్ననే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిండ్రు. అక్కడ రైతులంతా ధర్నాలు చేస్తున్నా రు. అక్కడి నాయకులు వచ్చి మేం ఐదు గంటలు కరెంట్‌ ఇస్తున్నమని చెబుతుర్రు. తెలంగాణ రైతులకు అంతా అర్థం అయితుంది. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకోసం 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తున్నది. మోటర్లకు కేంద్రం మీటర్లు పెట్టుమంటేనే కేసీఆర్‌ ఒప్పుకోలే. అలాంటిది రైతులను ఇబ్బందులకు గురి చేస్తడా. గిదే కాంగ్రెస్‌ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అయింది. భూములన్నీ దుమ్ముతో కనిపిస్తుండే. రైతులం వందల ఫీట్లు బోర్లు వేసేది. నీళ్లు పడితే కరెంట్‌ సక్కగ రాకపోయేది. వరి పండదని కూరగాయలు వేస్తే కరెంట్‌ కోతలతో చేతికివచ్చిన పంటలు ఎండిపోయేది. గిదీ కాంగ్రెస్‌ ప్రభు త్వం చేసిన పని. అధికారం కోసం పాకులాడుతుండు తప్పా.. కాంగ్రెసోళ్లు ఎన్నడూ కూడా రైతులను పట్టించుకోలేదు.. గతంలో వీళ్లేకదా పాలించింది. మరి ఏం చేసిండ్రు. రైతును ఆదుకున్నది కేసీఆర్‌ వల్లనే అయితది. సచ్చిపోతే రూ.5 లక్షలు ఇస్తుండు. టైంకు రైతుబంధు ఇస్తుండు. కేసీఆర్‌ ప్రభుత్వమే మళ్లీ వస్తది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z