DailyDose

భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఢిల్లీకి విమానం మళ్లింపు-నేర వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఢిల్లీకి విమానం మళ్లింపు-నేర వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఢిల్లీకి విమానం మళ్లింపు

భార్యాభర్తల మధ్య గొడవ (Husband Wife Fight) బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన ఓ విమానాన్ని (Bangkok Flight) ఢిల్లీకి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్‌ అయినట్లు అధికారులు తెలిపారు.లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన LH772 విమానం (Lufthansa flight) మ్యూనిచ్‌ నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే అందులోని జర్మన్ వ్యక్తి అతని థాయ్ భార్య మధ్య వివాదం మొదలైంది. అదికాస్తా కాసేపటికి తీవ్రమైన వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో తన భర్తపై థాయ్‌ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. భర్త తనని బెదిరిస్తున్నాడంటూ వారి సాయం కోరింది. దీంతో క్రూ సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ దృష్టికి తీసుకెళ్లారు. విమానాన్ని ముందుగా పాకిస్థాన్‌ విమానాశ్రయంలో దించేందుకు అనుమతి కోరారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. చివరికి ఢిల్లీలో ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. దీంతో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ కాగానే భర్తని ఫ్లైట్‌ నుంచి దింపి ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీకి అప్పగించినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (Directorate General of Civil Aviation ) వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత కాసేపటికి విమానం బ్యాంకాక్‌కు వెళ్లినట్లు తెలిపారు.

టీసీలుగా కేటుగాళ్ల అవతారం

మోసాలకు కాదేది అనర్హం అన్నట్లు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే దుర్భుద్ధితో దారుణాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని నయా మోసాలకు తెరలేపుతున్నారు. అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుని దండుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి చీరాల రైల్వే స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు నకిలీ టీసీలుగా అవతారం ఎత్తారు. ఈ ముగ్గురు గత కొద్ది రోజులుగా టీసీల యూనిఫామ్ ధరించి రైళ్లలో టికెట్లను తనిఖీ చేస్తున్నారు. టికెట్ లేని అమాయకుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. ఇలా చేస్తుండగా మంగళవారం చీరాల రైల్వే టీసీ రాజేశ్‌కు నిందితులు తారసపడ్డారు. ఈ ముగ్గురు టీసీలు నకిలీలని నిర్ధారించుకుని జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జీఆర్పీ పోలీసులు నిందితులను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండయ్య బుధవారం వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం

ప్రేమను పంచె తల్లిదండ్రులకు ఆ పిల్లలు తప్పు చేస్తే మందలించే హక్కు కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం చిన్న బాలుడిని కూడా మందలించాలి అంటే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ్ముడితో గొడవ పడొద్దని మందలించినందుకు ఓ 10 ఏళ్ళ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా లోని ఇబ్రహీంపట్నం లోని గాజులపేటలో సిద్ధార్థ అనే బాలుడు 5 తరగతి చదువుతున్నాడు. అయితే తల్లి మందలించిందని ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనితో ఇబ్రహీంపట్నం గాజులపేటలో ఘోర విషాదం నెలకొంది.పోలీసుల సమాచారం ప్రకారం.. స్కూల్ నుంచి రాగానే తన చిన్న తమ్ముడు మోక్షజ్ఞతో గొడవ పడుతూ ఉండగా తల్లి సిద్ధార్థ్ ను మందలించింది. దీనితో మనస్థాపానికి గురైన పదేళ్ల సిద్ధార్థ్ ఇంట్లో బట్టలు ఆరవేసే దండంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎస్సై విజయలక్ష్మి హుటాహుటీన ఘటన స్థలకానికి చేరుకున్నారు. అనంతరం. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాలుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. కుమారుడి మృతితో బాలుడి తల్లి గుండెలవిసేలా రోదిస్తుంది. ఆమె రోదన చూసిన వాళ్లకు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తెదేపా నేత బీటెక్‌ రవికి కడప జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)(Btech Ravi)కి కడప జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నవంబరు 14 నుంచి కడప జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవి బుధవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బీటెక్‌ రవిని అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో కడప జిల్లా కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది.

శ్రీకాకుళం జిల్లా లో దారుణం

శ్రీకాకుళం జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఉరిటి స్వప్నప్రియ అనే మహిళ మృతి చెందింది. ఎస్బిఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న స్వప్నప్రియ ఆత్మ హత్యకు యత్నించి చికిత్స పొందుతూ మరణించింది. వివరాలలోకి వెళ్తే.. స్వప్నప్రియ పని చేస్తున్న బ్యాంకులో బంగారం తనకా పెట్టారు ఖాతాదారులు. కాగా తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు ఖాతాదారులు గత పది రోజులుగా బ్యాంకును సంప్రదిస్తున్నారు. అయితే డబ్బులు తీసుకుని తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వాల్సిన సిబ్బంది.. ఆలా చెయ్యకుండా ఆడిట్ పేరుతో వాయిదా వేస్తూ వస్తున్నారు బ్యాంక్ సిబ్బంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తాకట్టు పెట్టిన బంగారం మిస్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బంగారాన్ని స్వప్న ప్రియే మిస్ చేసిందంటూ ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అయితే ఈ ప్రచారం పైన స్పందించిన SBI R.M. రాజు.. ఖాతాదారుల ఆందోళనలతో బంగారం మిస్ అయ్యిందన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ సోమవారం ప్రకటించారు. అలానే ఈ విషయం పైన అధికారులు మాట్లాడుతూ.. డిసెంబర్ 8నాటికి బ్యాంక్ ఆడిట్ పూర్తి చేసి ఖాతాదారుల బంగారాన్ని ఇచ్చేస్తామని వెల్లడించారు. కాగా స్వప్నప్రియ నిన్న రాత్రి పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను విశాఖ లోని కార్పొరేట్ హాస్పిటల్లో చెరిపించారు. ఈ క్రమంలో స్వప్నప్రియ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందింది. SBI అధికారులు ఖాతాదారులకు బంగారం ఆడిట్ అయిపోగానే ఇస్తామని ప్రకటించిన రెండు రోజులకే స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో బాధితల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలానే స్వప్న ప్రియ మృతితో బంగారం మిస్ అయ్యిందన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని బాధిత ఖాతాదారులు పేర్కొంటున్నారు.

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన

విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వై.బాలరాజు(60), అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం తెల్లవారుజామున చనిపోగా.. చిన్నకుమారుడు కార్తిక్‌ (21) రెండు రోజుల క్రితమే మృతి చెందాడు.ఇంట్లో వంటగ్యాస్‌ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చే క్రమంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో వాంబే కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత  గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన వీరంతా మృతి చెందడం బాధాకరమని కాలనీవాసులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైలులో ఆహారం తిన్న ప్రయాణికులు అస్వస్థత

ఆహారం తిన్న 90 మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. (Train Passengers Fall Sick ) ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్‌కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్పించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన జరిగింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న భారత్ గౌరవ్ రైలులో సుమారు వెయ్యి మంది ప్రయాణించారు. అయితే మంగళవారం పూణె చేరే ముందు ఆ రైలులో ఆహారం తిన్న సుమారు 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు, కడుపులో నొప్పి, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.కాగా, ఈ విషయం తెలుసుకున్న పూణె రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే, స్థానిక డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే రైల్వే స్టేషన్‌కు రప్పించారు. పూణెకు చేరుకున్న ఆ రైలులో అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వెంటనే వైద్య చికిత్స అందించారు.మరోవైపు భారత్ గౌరవ్ యాత్ర రైలును ఒక ప్రైవేట్‌ సంస్థ బుక్‌ చేసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.  కలుషిత ఆహారం నమూనాలు సేకరించినట్లు పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పింది. అనంతరం ఆ కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

*  రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం విజయనగర్ కాలనీలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఇంటి ఆరుబయట ఉన్న మహిళ మెడలో నుంచి చైన్ దొంగిలించేందుకు చైన్ స్నాచర్స్ ప్రయత్నించారు. అయితే మహిళ ప్రతిఘటించడంతో దుండగులు ఆమె గొంతు కోశారు. గట్టిగా భార్య కేకలు వేయడంతో భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపైనా చైన్ స్నాచర్స్ దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి చైన్ స్నాచర్స్ పరారయ్యారు. చైన్ స్నాచర్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ, ఆమె భర్తను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z