* వారెన్ బఫ్ఫెట్ రైట్‌హ్యాండ్ చార్లీ ముంగర్ ఇకలేరు
వారెన్ బఫ్ఫెట్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన షేర్లన్ని కూడా మంచి లాభాలను ఇస్తాయని ఇన్వెస్టర్ల నమ్మకం. ఆయనకు బెర్క్‌షైర్ హాత్‌వే అనే కంపెనీ ఉన్న విషయం కూడా చాలా మందికి తెలిసిందే. ఈ కంపెనీ ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించిన వారెన్ బఫ్ఫెట్ రైట్‌హ్యాండ్ చార్లీ ముంగర్(99) మంగళవారం నాడు మరణించారు. కాలిఫోర్నియా ఆసుపత్రిలో ఆయన చనిపోయినట్లు బెర్క్‌షైర్ ఒక ప్రకటనలో తెలిపింది.బెర్క్‌షైర్‌కు ముంగర్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. బెర్క్‌షైర్ హాత్‌వే అతిపెద్ద సామ్రజ్యంగా మారడానికి వారెన్ బఫ్ఫెట్‌కు అన్ని విధాల సహాయపడ్డాడు. ‘చార్లీ స్ఫూర్తి, జ్ఞానం, భాగస్వామ్యం లేకుండా బెర్క్‌షైర్ హాత్‌వే ప్రస్తుత స్థితికి రాలేకపొయేదని’ బఫ్ఫెట్ ఒక ప్రకటనలో తెలిపారు. బఫ్ఫెట్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముంగర్‌ను సంప్రదించాకే తీసుకునేవారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.కంపెనీకి వీరిద్దరు కూడా మెయిన్ పిల్లర్లుగా నిలిచారు. దాదాపు 1960 నుంచి వీరిద్దరి జర్నీ మొదలైంది. కంపెనీలను కొనుగోలు చేయడం, ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. 2022 నాటికి బెర్క్‌షైర్‌ను ఏడాదికి 20 శాతం లాభాలు ఇచ్చే విధంగా అభివృద్ధి చేయడంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైంది. చార్లీ ముంగర్ సంపద మొత్తం 2.2 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
* ఏపీ ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు (నవంబర్ 30) సెలవు ప్రకటించింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఉద్యోగులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారు తెలంగాణలో నవండర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటే.. వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తున్నట్లు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ఈ సెలవు మంజూరు చేస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నవంబర్ 30న సెలవు ప్రకటించడంతో పాటు ఓటింగ్ లో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వినతిని కూడా ఏపీ సీఈఓ ముఖ్య ఎన్నికల అధికారి అంగీకరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవు కావాలని కోరుకుంటున్న ఏపీ ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందేలా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు ఇది మేలు చేయనుంది.
* చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్ ‘చాట్‌బోట్-క్యూ’
ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ‘చాట్‌బోట్-క్యూ’ తెచ్చింది. లాస్ వేగాస్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ వార్షిక సదస్సులో అమెజాన్ ఈ సంగతి బయట పెట్టింది. సాధారణ భాషల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని ఏడబ్ల్యూఎస్ సీఈఓ ఆడం సెలీప్ స్కై చెప్పారు. ఇది త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నదని తెలుస్తున్నది. 2022 నవంబర్‌లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ సేవలు వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు తమ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బోట్‌లను తెస్తున్నాయి. కంటెంట్ తయారీ, రోజువారీ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ క్రమబద్ధీకరణ, బ్లాగ్ పోస్ట్‌ల రచన వంటి పనులు తమ ‘క్యూ’ తేలిగ్గా చేస్తుందని అమెజాన్ పేర్కొంది.ఇతర కంపెనీలు తమ ‘క్యూ’కు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుని వాడుకోవచ్చునని అమెజాన్ పేర్కొన్నది. ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్, కంపెనీ డాక్యుమెంట్ పేజీలు, స్లాక్ తరహా డెవలపర్ ఎన్విరాన్‌మెంట్స్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అమెజాన్ ‘క్యూ’ యాక్సెస్ పొందొచ్చు.క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంటే ముందు వరుసలో నిలిచిన అమెజాన్.. జనరేటివ్ ఏఐ వంటి నూతన ఆవిష్కరణలకు మూలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌లో వెనకబడింది. తాజాగా రూపొందించిన అమెజాన్ ‘క్యూ’పై అడ్మినిస్ట్రేటర్లు నియంత్రణ కలిగి ఉంటారు. అమెజాన్ ఎస్3, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్, సేల్స్ ఫోర్స్ వంటి 40+ పాపులర్ డేటా వనరులతో అమెజాన్ ‘క్యూ’ వస్తున్నది.
* టాప్-20లోకి అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ (Gautam adani) ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ టాప్-20లోకి వచ్చారు. ఒకప్పుడు టాప్-3 స్థానాన్ని అందుకున్న ఆయన.. అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం ఆ స్థానాన్ని కోల్పోయారు. నివేదిక అనంతరం కంపెనీ షేర్లు భారీగా పతనం కావడంతో ఏకంగా మూడో స్థానం నుంచి 30వ స్థానానికి చేరుకున్నారు. తాజాగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మళ్లీ రాణిస్తుండడంతో కుబేరుల జాబితాలో పైకి వచ్చారు.బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ కుబేరుల తాజా జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ 19వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 66.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా.. జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్-3లో కొనసాగుతున్నారు. భారత్‌కు చెందిన ముకేశ్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే గౌతమ్ అదానీ సంపద ఇంకా 53.8 బిలియన్ డాలర్లు తక్కువగానే ఉండడం గమనార్హం.అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు రాణిస్తున్నాయి. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో హిండెన్‌బర్గ్ నివేదికలోని అంశాలన్నిటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేద’ని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల్లో కొనుగోళ్ల మద్దుతు కనిపిస్తోంది. బుధవారం సైతం గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.33 వేల కోట్లు మేర పెరిగింది. మరోవైపు బ్లూమ్‌బెర్గ్ 500 కుబేరుల జాబితాలో భారత్ నుంచి షాపూర్ మిస్త్రీ, శివ్‌నాడార్, సావిత్రి జిందాల్, అజీమ్ ప్రేమ్‌జీ, రాధాకృష్ణ ధమానీ, ఉదయ్ కోటక్ వంటి వారు ఉన్నారు.
* వీడియో గేమ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలువుల కోత
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన వీడియో గేమ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ యూనిటీ 3.8 శాతం ఉద్యోగులను (Layoffs) సాగనంపనుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రియాలజీ డైరెక్టర్ పీటర్ జాక్సన్‌కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ వీటా డిజిటల్ ఒప్పందం రద్దుచేసుకోవడంతో ఏకంగా 265 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. యూనిటీ కార్యకలపాలను క్రమబద్ధీకరిస్తూ కీలక వ్యాపార విభాగాలపై దృష్టి సారించడంలో భాగంగా యూనిటీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.కొలువుల కోతతో పాటు బెర్లిన్, సింగపూర్‌లో కార్యాలయాలను యూనిటీ మూసివేయనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోచ బెల్లెవ్, వాషింగ్టన్ సహా పలు లొకేషన్స్‌లో కంపెనీ కార్యాలయాల సంఖ్యను కుదించనుంది. ఇక వీటా డిజిటల్‌కు టెక్నికల్ సపోర్ట్‌తో పాటు ఇతర సేవలు అందించే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న 265 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించాల్సి వచ్చింది.ఇక యూనిటీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనిటీ పోకేమాన్ గో క్రియేషన్‌లో కీలక పాత్ర పోషించింది. ఇక వ్యాపారాలపై రీఫోకస్‌లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని యూనిటీ టెక్నాలజీస్ సీఈవో జేమ్స్ వైట్‌హస్ట్ వెల్లడించారు.
* టాటా ఇంటర్నేషనల్ నైజీరియాలో కార్యకలాపాలను మొదలు
లాగోస్ ఫ్రీ జోన్ (ఎల్ఎఫ్జెడ్)తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా నైజీరియాలో కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నట్టు టాటా ఇంటర్నేషనల్ ప్రకటించింది. సంస్థ ఎండీ ఆనంద్ సేన్ సమక్షంలో టాటా ఆఫ్రికా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లెన్ బ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ సంస్థ ఆఫ్రికా ఆర్థిక రంగానికి కీలక సహకారాన్ని అందిస్తోందని సేన్చెప్పారు.2006లో టాటా ఇంటర్నేషనల్ నైజీరియాలో కార్యకలాపాలను మొదలుపెట్టింది. సింగపూర్‌కు చెందిన తోలారమ్గ్రూపు సహకారంతో ఇక్కడ పనిచేస్తామని టాటా తెలిపింది. ఎల్ఎఫ్జెడ్ నైజీరియాలోని మొదటి ఏకైక ఫ్రీ జోన్. ఇది ఈ ప్రాంతంలోని లోతైన ఓడరేవు లెక్కి పోర్ట్‌తో ప్రత్యేకంగా అనుసంధానమై ఉంది
👉 – Please join our whatsapp channel here –