ఎన్నికల్లో ఓటు వేయనివారికి కొన్ని దేశాల్లో జరిమానా విధిస్తారు. మరికొన్ని దేశాల్లో నేరస్థులుగా పరిగణించి శిక్షలు వేస్తారు. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఓటు వేయని వారికి ఆ దేశ కరెన్సీ ప్రకారం 20 డాలర్ల జరిమానా విధిస్తారు. దాన్ని నిర్దిష్ట గడువులోగా చెల్లించకపోతే 200 డాలర్ల వరకు అదనపు జరిమానా కట్టాల్సి ఉంటుంది. బెల్జియంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి 80 యూరోల వరకు, రెండోసారి ఓటు వేయనివారికి 200 యూరోల వరకు జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగుసార్లు ఓటు హక్కు వినియోగించుకోని పక్షంలో పదేళ్ల వరకు జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. దీనికితోడు ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వరు. ఓటు వేయనివారు బ్రెజిల్లోనూ ఫైన్ కట్టాలి. గ్రీసు, ఈజిప్టు దేశాల్లో ఓటు వేయనివారిపై ప్రత్యేక విచారణ చేపడతారు. సరైన కారణం చెబితే హెచ్చరించి వదిలేస్తారు. ఎలాంటి కారణం లేకుండా ఓటు వేయలేదని తేలితే జైలుశిక్ష విధిస్తారు. ఇటలీలో ఓటు వేయనివారి పేర్లను అందరికీ తెలిసేలా అధికారిక పత్రాల్లో ప్రచురిస్తారు. పెరూలో ఓటుకు దూరంగా ఉన్నవారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారు. ఇలా… ఓటు వేయనివారికి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన శిక్షలు, ఆంక్షలు ఉన్నాయి. ఏ శిక్షా లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశమున్న మన దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన వజ్రాయుధాన్ని సంధించడంలో బద్ధకంగా ఉండటం భావ్యమేనా..?
👉 – Please join our whatsapp channel here –