పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్‌రూమ్‌లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి… చెప్పినవి విని… ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. అయిదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో కీలక నేతల రాజకీయ భవితవ్యం గురువారం నిర్ణయమవనుంది. పోలింగ్ సిబ్బంది వేలికి సిరా చుక్క పెట్టాక ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కి తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపుతో ఆ తీర్పు వెలువడనుంది.
ఈ ఎన్నికల పర్వంలో అగ్రనేతలు ప్రజలను ఆకర్షించేందుకు పోటాపోటీగా అనేక హామీలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సారి ఎన్నికల్లో అతిరథ మహారథులు, ముఖ్య నాయకులు, తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్న వారు తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. కీలక నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు సాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాస; 118 స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో ఒక చోట సీపీఐ; 111 చోట్ల భాజపా, పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన; 19 నియోజకవర్గాల్లో సీపీఎం; 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్సీలు సహా 2,290 మంది అదృష్ట పరీక్షను ఎదుర్కొంటున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరే…
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్‌రెడ్డి(కొడంగల్, కామారెడ్డి), ఉత్తమ్(హుజూర్‌నగర్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(నల్గొండ); భాజపా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్(కరీంనగర్), సోయం బాపురావు(బోథ్), అర్వింద్(కోరుట్ల); భారాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(దుబ్బాక) రంగంలో ఉన్నారు. భారాస ఎమ్మెల్సీలు కౌశిక్‌రెడ్డి(హుజూరాబాద్), పల్లా రాజేశ్వర్‌రెడ్డి(జనగామ), కడియం శ్రీహరి(స్టేషన్‌ఘన్‌పూర్); కాంగ్రెస్ నుంచి టి. జీవన్‌రెడ్డి(జగిత్యాల), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) పోటీ చేస్తున్నారు.
30 స్థానాల్లో కీలక నేతల పోటీ
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 చోట్ల కీలక నేతలు రంగంలో ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో మరోమారు పోటీ చేస్తుండగా ఇక్కడ భాజపా నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తలపడుతున్నారు. కేసీఆర్ బరిలో నిలిచిన మరో స్థానం కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండగా భాజపా కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాలుగోసారి సిరిసిల్ల బరిలో దిగారు. గత ఎన్నికల్లో ఆయన భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌తో పాటు, భాజపా కూడా బలం నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. సిద్దిపేటలో భారాస కీలకనేత, మంత్రి హరీశ్‌రావు మరోసారి పోటీలో నిలిచారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో భారాస నుంచి, బండి సంజయ్ భాజపా తరఫున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే జిల్లాలోని హుజూరాబాద్‌లో ఈటల రంగంలో ఉండడంతో భారాస ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిసారించడంతో ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్‌లో పాత ప్రత్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పోటీ చేస్తున్న నిర్మల్‌లో పాత ప్రత్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇక్కడ భాజపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు బరిలో ఉన్నారు. సిర్పూరు కూడా ఆసక్తికర పోరుకు వేదికైంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, భారాస సీనియర్ నేత కోనేరు కోనప్ప పోటీ చేస్తుండగా బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ రంగంలో ఉన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీశ్ భాజపా తరఫున, కాంగ్రెస్ అభ్యర్థిగా రావి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మంథనిలో కాంగ్రెస్ కీలక నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, భారాస అభ్యర్థి, జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు మరోమారు పోటీపడుతున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి పోటీ చేస్తున్న బాల్కొండలో ముక్కోణపు పోటీ ఉంది. బాన్సువాడలో స్పీకర్, సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోమారు బరిలో దిగారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మేడ్చల్, మహేశ్వరం, సనత్‌నగర్‌లలో ముగ్గురు మంత్రులు రంగంలో ఉండటంతో ఈ స్థానాలపై ఉత్కంఠ ఉంది. వాటిపై కాంగ్రెస్, భాజపా ప్రత్యేక దృష్టిసారించాయి. మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, భాజపా సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ కోట నీలిమను పోటీకి దించింది.
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖమ్మం
ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి మరోమారు పోటీ చేస్తున్నారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు ఆసక్తికరంగా మారాయి. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోమారు బరిలో నిలిచారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి పోటీ చేస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి నుంచి మరోమారు మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, భాజపా నుంచి ఎస్.కుమార్ తలపడుతున్నారు. ఖమ్మం స్థానం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పోటీపడుతున్నారు. ఈ స్థానాన్ని భారాస, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కె.ఉపేందర్‌రెడ్డి భారాస నుంచి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా బరిలో ఉండటంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా ఉంది. కొత్తగూడెంలో భారాస నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల మధ్య ముక్కోణపు పోరు జరుగుతోంది. మధిర నుంచి మరోమారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తలపడుతున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాత ప్రత్యర్థులు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో, మరో కాంగ్రెస్‌నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో బరిలో ఉన్నారు. మునుగోడులో భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భాజపా అభ్యర్థి చెలమల కృష్ణారెడ్డిల మధ్య త్రిముఖపోటీ నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రంగంలో ఉండటంతో కొడంగల్ పోరు ఆసక్తికరంగా మారింది. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. వనపర్తిలో మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తుండగా భారాస, భాజపా అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) బరిలో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –