DailyDose

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలు పోటాపోటీ

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలు పోటాపోటీ

పోలింగ్‌కు ముందు రోజు బుధవారం ప్రలోభాలపర్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగింది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయి. ప్రచారంలోనే కాదు ప్రలోభాల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి కోసం పలు చోట్ల అభ్యర్థులు తమ వ్యూహాన్ని జాప్యం చేసి చివరిరోజు అమలుచేశారు. కొందరు ప్రత్యర్థి కంటే ఎక్కువ మొత్తం ఇవ్వగా, మరికొందరు ఎక్కువమంది ఓటర్లకు డబ్బు పంచారు. పోటీ తీవ్రంగా ఉన్నచోట ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లు మద్యానికే ఒక్కొక్కరు రూ.అయిదారు కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. తమ విజయావకాశాల్ని పెంచుకునేందుకు దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పెద్దఎత్తున సొంతూర్లకు రప్పిస్తున్నారు. కొందరు ప్రయాణ ఖర్చులు ఇస్తే, మరికొందరు వాహనాలు ఏర్పాటుచేశారు.పలు ప్రాంతాల్లో పార్టీల స్థానిక నేతలు ఓ అవగాహనతో ప్రలోభాల పర్వాన్ని పూర్తిచేసుకున్నారు. గతంలో అయితే ఒక పార్టీ వాళ్లు డబ్బులు పంచుతుంటే మరో పార్టీ వాళ్లు అడ్డుకోవడం, ఫిర్యాదులు చేయడం పెద్దసంఖ్యలో ఉండేవి. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పరిస్థితి చాలా తక్కువ. ఎదురెదురు పడ్డా.. వివాదం లేకుండా ప్రధాన పార్టీల కార్యకర్తలు డబ్బు, మద్యం పంపిణీని ఓ పద్ధతి ప్రకారం చేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం రూ.2 వేలు.. బుధవారం రూ.5 వేలు
పెద్దపల్లి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి మంగళవారం పలు చోట్ల ఓటుకు రూ.2 వేల చొప్పున పంచినట్లు సమాచారం. గెలుపుపై సందేహం ఉండటంతో బుధవారం మిగతాచోట్ల ఓటుకు రూ.5 వేలు పంచినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి తొలుత రూ.500 చొప్పున పంచగా, బుధవారం రూ.వెయ్యికి పెంచినట్లు తెలిసింది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల చొప్పున, మరొకరు రూ.వెయ్యి వంతున పంపిణీ చేసినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఓ కీలక స్థానంలో ప్రధాన అభ్యర్థి తరఫున ఆ పార్టీల కార్యకర్తలు ఓటుకు రూ.2 వేలు, తీవ్ర పోటీ ఇస్తున్న మరో అభ్యర్థి తరఫున ఓటుకు రూ.వెయ్యి ఇచ్చినట్లు తెలిసింది. ఓ సీనియర్‌ నేత నియోజకవర్గం మారి పోటీ చేస్తున్నచోట త్రిముఖ పోటీ నెలకొనగా.. ఓ అభ్యర్థి 2 వేలు, మిగతా ఇద్దరు రూ.వెయ్యేసి పంపిణీ పూర్తిచేసినట్లు సమాచారం. తొలి విడత రూ.వెయ్యి చొప్పున ఇచ్చిన ఓ నేత రెండో విడత కూడా ఎంపికచేసిన ప్రాంతాల్లో మరో రూ.వెయ్యేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. పారిశ్రామిక ప్రాంతమైన ఓ నియోజకవర్గంలో చీప్‌లిక్కర్‌, బ్రాండెడ్‌ మద్యం ఏరులై పారింది.

బలవంతుల బరిలో….
ఆర్థికంగా బలవంతులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో చోట ప్రచారం, ప్రలోభాల ఖర్చు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఓటుకు రూ.3వేల చొప్పున చెరో రెండు లక్షల మంది ఓటర్లకు పంచినట్లు సమాచారం. ఈ మొత్తం రూ.120 కోట్లకుపైగా ఉంటుందని, పక్షం రోజులపాటు ప్రచారం, మద్యం, ఇతర ఖర్చులకు రూ.40-50 కోట్ల వరకు ఇద్దరూ ఖర్చుచేశారని అంచనా. ఇదే జిల్లాలో మరో ప్రధాన నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కలిపి రూ.150 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ముఖ్య నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. పార్టీ మారి బరిలో ఉన్న ఓ ప్రధాన అభ్యర్థి 90 శాతం మంది ఓటర్లకు, తొలి నుంచి ఒకే పార్టీలో ఉన్న మరో అభ్యర్థి 80 శాతం మందికి, తొలి సారి బరిలో దిగుతున్న మరో అభ్యర్థి 70 శాతం ఓటర్లకు డబ్బు పంచినట్లు తెలుస్తోంది. ముగ్గురు అభ్యర్థులూ ఓటుకు రూ.2 వేల చొప్పున పంచినట్లు సమాచారం. ఒక అభ్యర్థి- టికెట్‌ ఖరారైనప్పటి నుంచి ప్రచార ఖర్చులు, ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ కలిపి రూ.65 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. మరో ఇద్దరు రూ.140 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాలోని ఓ ముఖ్య నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థుల్లో ఒకరు రూ.రెండేసి వేలు ఇవ్వగా, ప్రత్యర్థి ఆర్థికంగా బలవంతుడైనా గెలుపుపై ధీమా ఉన్న అభ్యర్థి రూ.వెయ్యి చొప్పున పంచినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న ఓ నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థులు ఇద్దరూ రూ.రెండేసి వేలు ఇవ్వగా.. గెలుపు విషయంలో రిస్క్‌ తీసుకోవద్దన్న భావనతో ఒకరు రెండో విడత రూ.వెయ్యి చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందరికీ డబ్బులు పంపిణీ చేసి తమకు ఎందుకు ఇవ్వరు అంటూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కొందరు మహిళలు ఓ పార్టీ నేతలతో గొడవకు దిగారు. ఈ వీడియో స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఓ పార్టీకి చెందిన నాయకులు పట్టణంలోని మూడో వార్డులో ఓటర్లకు పోల్‌ చిట్టీలు పంపిణీ చేసేందుకు వచ్చారు. ఇతరులకు డబ్బు ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వరంటూ వారితో వాగ్వాదానికి దిగారు. ‘మా పార్టీకి ఓటు వేయని మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటూ కేవలం పోల్‌ చిట్టీలు మాత్రమే ఇచ్చి వెళ్లారు’ అని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, ఏటూరునాగారం ఎస్సై కృష్ణప్రసాద్‌లను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z