DailyDose

ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేరు!

ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేరు!

‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్‌..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు… వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది. రేపు ప్రభుత్వం మారితే అనేక కేసులు వారి మెడకూ చుట్టుకోవచ్చు..! టైం బాగోకపోతే కారాగారవాసమూ తప్పకపోవచ్చు..!

– నాలుగున్నరేళ్లకుపైగా జగన్‌ ప్రభుత్వంలో తమకు తిరుగే లేదన్నట్టుగా చెలరేగిపోయిన కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు, అఖిల భారత సర్వీసులకు చెందిన కొద్దిమంది అధికారుల్లో దడ పుట్టిస్తున్న భావన ఇది.

‘‘చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, లోకేశ్‌, ఇతర నేతలు ఊరుకునేలా లేరు. ప్రభుత్వం మారితే నాకు ఇబ్బందే. ప్రైవేటు సెక్టార్‌లో మంచి పోస్టు ఏదైనా ఉంటే చూడు బాస్‌..’’

– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్‌ అధికారి మరో ఐఏఎస్‌ అధికారితో ఇటీవల అన్న మాటలివి.

‘‘నేను పోస్టింగ్‌ కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అనవసరంగా ఈ రొంపిలోకి దిగి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు?’’

– గతంలో కీలక శాఖల్లో పనిచేసి, వైకాపా ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టులకే పరిమితమై.. ప్రస్తుతం పోస్టింగ్‌ కూడా లేని అధికారి తన సహచరుడితో అన్న మాటలు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేంటని కొందరు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా ఎలాంటి ఆధారాల్లేకపోయినా, ప్రతిపక్ష నాయకులపైనా, ప్రభుత్వానికి గిట్టని వారిపైనా అక్రమ కేసులు బనాయించి, మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసి.. ఇప్పటి ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు భయపడో, ఒత్తిళ్లకు తలొగ్గో, ప్రలోభాలకు లొంగిపోయో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారుల్లోనూ అంతర్మథనం సాగుతున్నట్టు తెలుస్తోంది. మద్యం, గనులు, ఇసుక, మట్టి దోపిడీ, భూముల కబ్జా.. వంటి అనేక అక్రమ వ్యవహారాలకు, అవినీతికి, అడ్డగోలు నిర్ణయాలకు సహకరిస్తూ, పనిలో పనిగా స్వయంగా దొరికినంత మేసేసిన అధికారుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. వారంతా ఆంతరంగిక చర్చల్లోను, సహచర అధికారులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. తమ మనసులోని ఆందోళన పంచుకుంటున్నట్టు సమాచారం. మాజీ సీఎం, మాజీ మంత్రులు సహా విపక్ష పార్టీకి చెందిన నాయకులపైనా, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా అక్రమ కేసులు బనాయించి ఎలా వేధించవచ్చో జగన్‌ ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే దానికో కారణం అవసరమే లేదన్నట్టుగా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి, మరో పార్టీ అధికారంలోకి వస్తే, వాళ్లూ జగన్‌ బాటలోనే కేసుల కొరడా ఝళిపిస్తే… మొదట బలయ్యేది తామేనన్న విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే తప్పించునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని తెలిసింది.

అధికారం అండ చూసుకుని పలువురు అధికారులు ఇన్నాళ్లు చెలరేగిపోయారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మారితే గడ్డుకాలమేనన్న అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్‌ పక్కన ప్రత్యక్షమై, అప్పటి నుంచి సీఎంఓలో చక్రం తిప్పుతున్న అధికారి, గతంలో సీఎంఓలో హల్‌చల్‌ చేసి, సహచర అధికారుల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మరో అధికారి, జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి, వైకాపా అధికారంలోకి వచ్చాక పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మరో అధికారి, గత ప్రభుత్వంలోనూ మూడు నాలుగు శాఖలకు ముఖ్యకార్యదర్శిగా పనిచేసి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి, మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసుల్లో వారికి ప్రతికూలంగా వాంగ్మూలం ఇచ్చిన ఉన్నతాధికారి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రతిపక్ష నాయకులపై ఫిర్యాదులు చేసి అక్రమ కేసులు పెడుతున్న అధికారులు… ఇలా ఆ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ కోవలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు మొదలు… డీఎస్పీలు, సీఐల వరకు ఉన్నారు.

ఎక్కడికెళ్లినా తప్పించుకోలేరు!
‘‘ఎక్కువ మంది ఐఏఎస్‌ అధికారుల్లో అభద్రతాభావం ఉంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ప్రభుత్వం మారితే దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో… వారు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిడి మేరకు నిధులు విడుదల చేశారు? వంటి వివరాలు, ఆధారాల్ని జాగ్రత్త చేసుకుంటున్నారు’’ అని ఒక అధికారి తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినా, మారకపోయినా కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న నిర్ణయానికి మరికొందరు అధికారులు వచ్చారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలు, అక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తూ, ఆ రొంపిలో పూర్తిగా కూరుకుపోయిన ఒకరిద్దరు మాత్రం నిండా మునిగాక చలేంటనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొందరు తమకున్న పరిచయాలతో ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నట్టు సమాచారం. నిజంగా తప్పులు చేసిన, అవకతవకలకు పాల్పడిన అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లినా, సొంత కేడర్‌కు వెళ్లిపోయినా… ప్రభుత్వం మారితే కేసుల నుంచి తప్పించుకోలేరని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z