ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు ముగుస్తుందని ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు తెలిపారు. పంపకాల్లో సర్దుబాట్లు కుదరక కోర్టు లెంపకాయలతో ఎన్నికల పట్టాలు ఎక్కిన తానా పదవుల పందేరం మంచి రసకందాయకంగా ఉంది. ద్విముఖ, త్రిముఖ స్థాయి దాటి తానా ఎన్నికలు ఇప్పుడు చతుర్ముఖ పోటీ వైపుగా సాగుతున్నాయి. కొంతమంది ప్యానెల్ అభ్యర్థులు ఇప్పటికే జోరుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకప్పటి అస్మదీయులు ఇప్పుడు తస్మదీయులుగా, స్వతంత్రులుగా, ఎన్నికల వేళ మాత్రమే మిత్రులుగా అమెరికావ్యాప్తంగా పలువురు ప్రవాసులు ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. తుది నామినేషన్ జాబితా ఆదివారం నాడు విడుదల కానున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను పదునుపెట్టారు. గత చరిత్రను తవ్వి వడబోస్తున్నారు. బోర్డుపై ఈమెయిళ్ల వర్షం కురిపిస్తున్నారు. బుజ్జగింపులు, అమలకు నోచని హామీలకు లొంగి ఎంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z