చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్‌లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది.
ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు.
ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు.
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –