ScienceAndTech

మన పేరుతో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి ?

మన పేరుతో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి ?

ఎన్నికలు జరిగే సమయంలో కొందరి పేర్లు జాబితాలో మిస్‌ కావడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో మన పేరు లేకపోతే నిరాశగా వెనుదిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే, మన పేరుతో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి అన్న ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. దానికి పరిష్కారమే సెక్షన్‌ 49(పి). 2018లో తమిళ హీరో విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్‌’ చిత్రంలో దీనికి చక్కటి పరిష్కారం చూపారు. ఓటేసేందుకు అమెరికా నుంచి విజయ్‌రాగా.. అప్పటికే ఆయన ఓటును వేరొకరు దొంగ ఓటు వేస్తారు. దీనిపై న్యాయపోరాటం చేసిన విజయ్‌ తన ఓటు హక్కు దక్కించుకుంటాడు.

మన ఓటు కూడా వేరే వారు వేస్తే కచ్చితంగా మన హక్కును సాధించుకోవాల్సిందే. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్‌49(పి)ను అమల్లోకి తెచ్చింది. పోలింగ్‌ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే ఈ సెక్షన్‌ ద్వారా ఓటు పొందాలనుకునేవారు ముందుగా ప్రిసైడింగ్‌ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి అతనేనని ఆయన ముందు నిరూపించుకోవాలి. అందుకోసం ఓటరు గుర్తింపుకార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఎన్నారైలు అయితే పాస్‌పోర్టు చూపించాలి. అప్పుడు ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చే ఫామ్‌ 17(బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. టెండర్‌ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రిసైడింగ్‌ అధికారి సదరు వ్యక్తికి ఇస్తారు. దానిపై నచ్చిన అభ్యర్థికి ఓటేసి తిరిగి ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలి. ఆయన ప్రత్యేక కవర్‌లో ఆ ఓటును భద్రపరిచి కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్‌ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు అనుమతివ్వరు. 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటుహక్కును టెండర్‌ ఓటు, ఛాలెంజ్‌ ఓటు అని పిలుస్తారు. నిజానికి ఎన్నికల్లో 49(పి) వినియోగించుకున్న వాళ్ళు చాలా అరుదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z