అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 2.9 శాతంగా నమోదవ్వొచ్చని.. వచ్చే ఏడాదికి ఇది 2.7 శాతానికి తగ్గవచ్చని బుధవారం పేర్కొంది. ఇదే జరిగితే 2020 తర్వాత అదే అత్యంత తక్కువ వృద్ధి అవుతుంది. యుద్ధాల ప్రభావం, అధిక ద్రవ్యోల్బణం, పై స్థాయిల్లోనే కొనసాగుతున్న వడ్డీ రేట్లు ప్రపంచ మందగమనానికి కారణంగా నిలవవచ్చని అంటోంది.
అమెరికా, చైనా కూడా..: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కూడా వచ్చే ఏడాది మందగమనంలోకే వెళ్లొచ్చని ఓఈసీడీ పేర్కొంది. ‘అమెరికా ఆర్థిక వృద్ధి 2023 అంచనా అయిన 2.4 శాతం నుంచి 2024లో 1.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వల్ల అమెరికా ద్రవ్యోల్బణం ఈ ఏడాది 3.9 శాతానికి, 2024లో 2.8 శాతానికి, 2025లో 2.2 శాతానికి తగ్గవచ్చ’ంటోంది. ‘ఇక స్థిరాస్తి సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న ఎగుమతుల వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ 2024లో 4.7 శాతం వృద్ధికే పరిమితం కావొచ్చు. ఈ ఏడాది 5.2 శాతం నమోదు కావొచ్చని అంచనా. చైనాలో ముందు జాగ్రత్త పొదుపు, ఉద్యోగ సృష్టిపై విశ్వాసం లేకపోవడం, ఇతర అనిశ్చితుల వల్ల వినియోగ వృద్ధి స్తబ్దుగా ఉండొచ్చ’ని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు, వడ్డీ రేట్లు పెరగడంతో ఐరోపా ప్రాంతంలోని 20 దేశాలు కూడా అంతర్జాతీయ మందగమనంలో ఓ చేయి వేయొచ్చని ఓఈసీడీ అంచనా వేసింది.
👉 – Please join our whatsapp channel here –