కార్తిక పౌర్ణమి సందర్భంగా కెనడా మిస్సిసౌగాలో కార్తిక పౌర్ణమి శ్రీచక్ర పూజలను వైభవంగా నిర్వహించారు. కెనడాలోని మిస్సిసౌగా, టొరంటో, బ్రాంప్టన్, మిల్టన్, స్కార్‌బరో తదితర నగరాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (North America Telugu Association (NATA) సహాయ సహకారాలతో, జీఆర్డీ లేయర్స్ గుర్‌కుల్ ఆధ్వర్యంలో సహస్ర సువాసిని పూజ, సమిష్టి శ్రీ చక్ర పూజ, సహస్ర లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెయ్యి మంది పైగా మహిళలు పాల్గొన్నారు. అమృత చైతన్య మండలి నుంచి 40 మంది శ్రీవిద్యా ఉపాసకులు చేసిన శ్రీచక్ర పూజ ఎంతగానో అలరించింది. ఈ పూజలో 2500 చదరపు అడుగుల శ్రీచక్ర యంత్రాన్ని నేలపై రంగురంగుల చీరలు, పుష్పాలతో అందంగా అలంకరించారు.
జీఆర్డీ లేయర్స్ గుర్‌కూల్ వ్యవస్థాపకులు రమేష్ నటరాజన్, ఆయన సతీమణి గాయత్రీ నటరాజన్ మాట్లాడుతూ ఉత్తర అమెరికాలోని కెనెడాలో వినూత్నంగా శ్రీ చక్రపూజలు నిర్వహించడం ఇదే ప్రథమమని అన్నారు. నాటా సహకారంతో సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొరసపాటి మాట్లాడుతూ కెనడా తెలుగు ఆడపడుచుల ఉత్తేజానికి జోహార్లని, భవిష్యత్తులో కెనడాలో మరింత వైవిద్యమైన కార్యక్రమాల నిర్వహణకు నాటా కృషి చేస్తుందని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –