DailyDose

మహిళపై అత్యాచారం కేసులో ఓ న్యాయవాదిని అరెస్టు-నేర వార్తలు

మహిళపై అత్యాచారం కేసులో ఓ న్యాయవాదిని అరెస్టు-నేర వార్తలు

* ఓటేసేందుకు వరుసలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు మృతి

ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ (78) పోలింగ్‌ బూత్‌ దగ్గరికి వచ్చే సరికి ఫిట్స్‌ వచ్చి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భుక్తాపుర్‌నకు చెందిన రాజన్న (65) అనే వృద్ధుడు ఓటేసేందుకు వరుసలో నిల్చున్నారు. అంతలోనే కళ్లు తిరిగిపడిపోవడంతో ఆయన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

* మహిళపై అత్యాచారం కేసులో ఓ న్యాయవాదిని అరెస్టు

ఎవరికైనా న్యాయం కావాలంటే వారి తరపున కేసు వాదించాల్సిన న్యాయవాదే ఓ కేసులో ముద్దాయిగా మారిన ఘటన కేరళలో జరిగింది. ఓ సీనియర్ ప్రభుత్వ న్యాయవాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కారణంగా అరెస్ట్ అయ్యారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఎర్నాకుళానికి చెందిన 25 ఏళ్ల మహిళ, 2018లో రేప్ కేసు బాధితురాలిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వ ప్లీడర్ పీజీ మను వద్దకు వెళ్లింది.అయితే, దీన్ని అలుసుగా తీసుకున్న లాయర్, ఆమెను లైంగికంగా వేధించాడు. వేధింపులకు పాల్పడ్డమే కాకుండాఅమె ఫోటోలు కూడా తీశాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. కేసు విషయమై చర్చించే నెపంతో పలుమార్లు పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధిత మహిళ పేర్కొంది. వేధింపులు భరించలేక ఆమె తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో మనుపై కేసు నమోదైంది. ఉన్నతాధికారుల సూచన మేరకు న్యాయవాది మను తన ఉద్యోగానికి రాజానామా చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. పీజీ మను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి న్యాయవాదిగా ఉన్నారు.

* ఆయుర్వేదిక్‌ సిరప్‌ తాగి అయిదుగురు మృతి

ఆయుర్వేదిక్‌ సిరప్‌ తాగి అయిదుగురు మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రి పాలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిథైల్‌ ఆల్కహాల్‌తో ఆ సిరప్‌ కలుషితమైనట్లు చెప్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్‌ పట్టణంలో జరిగింది.ఖేడా జిల్లాలోని నడియాడ్‌ పట్టణంలోని ఓ షాప్‌ నుంచి ఆయుర్వేదిక్‌ సిరప్‌ బాటిళ్లను 50 మంది దాకా కొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయుర్వేదిక్‌ సిరప్‌ను కల్‌మేఘాసవాసవ అరిష్ట అనే బ్రాండ్‌ పేరుతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.‘సిరప్‌లో విషపూరిత మిథైల్‌ ఆల్కహాల్‌ కలిపినట్లు అది తాగిన వారి రక్త పరీక్షలో బయటపడింది. షాపులో అమ్మే ముందు సిరప్‌లో మిథైల్‌ ఆల్కహాల్‌ కలిపినట్లు తేలింది. గడిచిన రెండు రోజుల్లో సిరప్‌ తాగినవారిలో అయిదుగురు చనిపోయారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సిరప్‌ అమ్మిన షాపు యజమానితో పాటు ముగ్గురిని అరెస్టు చేశాం’ ఖేడా ఎస్పీ రాజేష్‌ గదియా చెప్పారు.

* కర్ణాటకలో దారుణం

కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే మహిళా టీచర్‌ను కొందరు కిడ్నాప్ చేశారు. (Woman Teacher Kidnapped) బలవంతంగా ఎస్‌యూవీలోకి నెట్టి అపహరించారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల అర్పిత గురువారం సెలవు సందర్భంగా మూసి ఉన్న ఆ స్కూల్‌ బయట ఉంది. ఒక ఎస్‌యూవీ మెల్లగా ఆమె వద్దకు వచ్చింది. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆ వాహనంలోకి ఎక్కించారు. కేకలు వేస్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అర్పిత కిడ్నాప్ వెనుక బంధువైన రాము ప్రమేయం ఉన్నట్లు ఆమె తల్లి చెప్పిందన్నారు. వారిద్దరి మధ్య నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లుగా తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

* నిందితుడిపై పోలీసుల కేసు నమోదు

నకిలీ ఐడీ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో శ్రీవారి సుప్రభాత సేవను పొందిన వ్యక్తిపై తిరుమల టుటౌన్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. విజయవాడకు చెందిన రసూల్‌ కొంతకాలంగా నకిలీ ఐడీ ఆధార్‌ కార్డులతో టీటీడీ లక్కీడిప్‌లో పాల్గొనేవాడు. అలాగే సుప్రభాతసేవ టికెట్‌తో దర్శనానికి వచ్చిన అతడిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.
అతడి నుంచి నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకొన్నారు. ఎలాగైనా ఆర్జితసేవా టికెట్‌ పొందాలని నిందితుడు తన పాస్‌పోర్టు చివరి నంబర్లు మార్చి సుప్రభాత సేవల టికెట్లను బుక్‌ చేశాడు. కానీ టీటీడీకి అడ్డంగా దొరికిపోయాడు.

* ప్రాణాలు పోతున్నా పెను ప్రమాదాన్ని తప్పించాడు

టైల్స్ లోడ్‌తో విజయనగరం వెళ్తుంది ఆ లారీ. అయితే కొంతదూరం వెళ్లేసరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన లారీ డ్రైవర్ లారీని పక్కు ఆపి కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన క్లీనర్ అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించారని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా కోడూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన సాహూ గోపి (55) లారీ డ్రైవర్. విజయనగరం టైల్స్ లోడ్ తో బయలుదేరాడు. అయితే రాగంపేట శివారు పెనుగండేపల్లి మండలం నీలాద్రి రావుపేటకు వచ్చేసరికి గుండెనొప్పికి గురయ్యాడు. దీంతో ఎంతో చాకచక్యంగా లారీని పక్కు తీసి కుప్పకూలిపోయాడు. దీంతో క్లీనర్ మరో డ్రైవర్ సహాయంతో దగ్గరలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే గోపి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంలో మృతదేహాన్ని లారీలోనే ఉంచి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z