DailyDose

అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్‌, మేరుగు నాగార్జున అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి విజ్ఞప్తి చేసినట్లు బుధవారం వెల్లడించారు. సీఈఓను కలిసిన అనంతరం వీరు సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొని తర్వాత ఏపీ ఎన్నికల్లోనూ ఓటు వేయాలని కొందరు చూస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. దీనికి సంబంధించిన ఆధారాలను సీఈఓకు అందజేశాం. మరికొన్నింటిని ఇస్తాం’ అని పేర్కొన్నారు. వైకాపా నేతలు లక్షల సంఖ్యలో ఓట్లు చేర్చించారని, కొన్ని లక్షల ఓట్లను తొలగించారంటూ తెదేపా, జనసేన ఆరోపిస్తున్నాయని మంత్రులు అన్నారు. వాళ్లు ఎలాగూ ఓడిపోతారనే ఇలా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని విమర్శించారు.

యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేశారని జోగి రమేశ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందని ప్రశ్నించారు. 79 రోజుల పాటు పారిపోయిన లోకేశ్‌.. మంత్రులకు భయమంటే ఏమిటో చూపిస్తానని అంటున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వారిని ఉరికిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనే ఆలోచన తమకు లేదని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z