గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తితే.. పట్టణ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతమాత్రంగా ఉంది. హైదరాబాద్ లో అయితే మరీ దారుణంగా ఉంది. చదువుకున్నవాళ్లు, తెలివైనవాళ్లు, డబ్బున్నవాళ్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ లో ఓటు చైతన్యం మాత్రం ఉండటం లేదు. హాలిడే ఇచ్చినా, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా.. గ్రేటర్ ఓటర్లు మాత్రం గడప దాటడం లేదు. చదువుకున్నవారిని విజ్ఞులుగా భావిస్తారు. కానీ ఓటు వేసే విషయంలో హైదరాబాదీల విజ్ఞత ప్రతిసారీ ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణలో ఓటర్లు పోలింగ్ బూతులకు తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. హైదరాబాద్ జనం మాత్రం మారలేదు, ఎప్పటిలాగే నగరవాసులు ఓటు వేసేందుకు కదల్లేదు. గత ఎన్నికల్లో అత్యల్పంగా హైదరాబాద్‌లోనే ఓటింగ్ నమోదు అయ్యింది. అయితే ఈ సారి కూడా అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అయింది. కొందరు ఉదయమే లేచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నా.. ఓవరాల్ గా సీన్ మాత్రం మారలేదు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు నమోదైన పోలింగ్ శాతం చూస్తే.. కేవలం 20.79 శాతం మాత్రమే ఉండగా పోలింగ్ ముసిగే నాటికి అది 32 శాతం మాత్రమే ఉంది. పోలింగ్ జరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు మాత్రమే కాదు అన్ని సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది.
అయితే చాలామంది ఓటర్లు మాత్రం సెలవు రోజు కూడా ఇల్లు కదలడానికి ఇష్టం పడలేదు. ఓటు వేయడానికి ఇంత సోమరితనం ఎందుకు? ఓటు అనేది మన హక్కు. ఓటుపై ప్రతీసారి ఎన్నికల కమిషన్ సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా చాలామంది హైదరాబాదీలు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యం పెరుగుతోంది. అయితే.. మెట్రో నగరాల్లో మాత్రం ఈ చైతన్యం పూర్తిగా కొరవడుతోంది. మరీ ముఖ్యంగా మెట్రో యువత ఓటువేయడాన్ని తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాలకు వలసొస్తున్న వారిలో 91 శాతం మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కూడా ఆసక్తిచూపడం లేదు. గ్రేటర్‌లో సుమారు 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం చాలా తక్కువ. ఈ విషయం. గత సార్వత్రిక ఎన్నికలు, బల్దియా, మొన్నటి, నేటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర రంగాల ఉద్యోగులు, వేతనజీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –