Movies

‘యానిమల్‌’ సినిమా రివ్యూ

‘యానిమల్‌’ సినిమా రివ్యూ

చిత్రం: యానిమ‌ల్‌; నటీన‌టులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్‌, బాబీ డియోల్‌, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి, పృథ్వీరాజ్‌, శక్తి కపూర్‌, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్ త‌దిత‌రులు; సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్‌; సంగీతం: విశాల్ మిశ్రా, జాని, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్; నేప‌థ్య సంగీతం: హ‌ర్ష వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌; స్క్రీన్‌ప్లే: స‌ందీప్‌రెడ్డి వంగా, ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా, సౌర‌భ్ గుప్తా; నిర్మాణం: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా; క‌థ‌, కూర్పు, ద‌ర్శ‌క‌త్వం: స‌ందీప్ రెడ్డి వంగా; సంస్థ‌: టి.సిరీస్ ఫిల్మ్స్, భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్‌, సినీ1 స్టూడియోస్; విడుద‌ల‌: 01-12-2023

‘అర్జున్ రెడ్డి’తో మార్మోగిన పేరు.. సందీప్‌రెడ్డి వంగా. రామ్‌గోపాల్ వ‌ర్మ త‌ర్వాత మ‌ళ్లీ ఓ సినిమాతో అంత ప్ర‌భావం చూపించిన ద‌ర్శ‌కుడిగా సందీప్ పేరు సంపాదించారు. ఆ సినిమానే ఆయ‌న్ని బాలీవుడ్ వ‌ర‌కూ తీసుకెళ్లింది. అక్క‌డ ‘అర్జున్‌రెడ్డి’ని రీమేక్ చేసి మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆ రెండు సినిమాలు ఆయ‌న‌కి ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో క‌లిసి సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించాయి. బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌బీర్ – తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా క‌ల‌యిక‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్ర‌మే… ‘యానిమ‌ల్‌ (Animal movie review). కొన్నాళ్లుగా ఎక్క‌డ చూసినా ఈ సినిమా పేరే. ప్ర‌చార చిత్రాలతో ఈ సినిమా మ‌రిన్ని అంచ‌నాల్ని, ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రి ఈసినిమా ఎలా ఉంది? రణ్‌బీర్‌ను సందీప్‌ ఎంత వైల్డ్‌గా చూపించారు?

కథేంటంటే: స్వ‌స్తిక్ స్టీల్స్ అధినేత‌, దేశంలోనే సంప‌న్నుడైన బ‌ల్బీర్ సింగ్ (అనిల్ క‌పూర్‌) త‌న‌యుడు ర‌ణ్ విజ‌య్ (ర‌ణ్‌బీర్ సింగ్‌). ఎవ‌రినైనా స‌రే ధైర్యంగా ఎదిరించే ర‌కం. చిన్నతనం నుంచే నాన్నంటే చెప్ప‌లేనంత ప్రేమ‌. కానీ, త‌న వ్యాపారాల‌తో బిజీగా గ‌డుపుతూ కొడుకుని ప‌ట్టించుకోడు. దూకుడు మ‌న‌స్త‌త్వ‌మున్న విజ‌య్ ప‌నులు తండ్రి బ‌ల్బీర్‌సింగ్‌కి న‌చ్చ‌వు. ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. దాంతో త‌ను ప్రేమించిన గీతాంజ‌లి (ర‌ష్మిక‌)ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల త‌ర్వాత తండ్రిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని తెలియ‌డంతో హుటాహుటిన త‌న భార్య‌, పిల్ల‌ల‌తో ఇండియాకి వ‌స్తాడు. వ‌చ్చాక ఏం జ‌రిగింది? (Animal movie review in telugu) త‌న తండ్రిని హ‌త్య చేయాల‌నుకున్న శ‌త్రువుని విజ‌య్ ఎలా గుర్తించాడు? ఇంత‌కీ ఆ శత్రువు ఎవ‌రు? అత‌ని నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: తండ్రీ కొడుకుల ప్రేమ‌క‌థ ఇది. గుర్తుండిపోయేలా అర్జున్‌రెడ్డి పాత్ర‌ని సృష్టించిన సందీప్‌రెడ్డి.. ఇంచు మించు అదే త‌ర‌హా ఆలోచ‌న‌లున్న క‌థానాయ‌కుడిని తండ్రీ కొడుకుల క‌థ‌లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంద‌న్న‌దే ఈ చిత్రం. నిజానికి ఈ క‌థ కొత్తది కాదు. ఈ త‌ర‌హా భావోద్వేగాలు అంత‌క‌న్నా కొత్త‌వి కాదు. క‌థ‌గా చూస్తే చాలా సినిమాలు గుర్తొస్తాయి. కానీ, ద‌ర్శ‌కుడు త‌నదైన శైలి ర‌చ‌న‌తో సినిమాకి కొత్త‌ద‌నాన్ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా క‌థానాయ‌కుడి పాత్ర‌, సంఘ‌ర్ష‌ణ‌, మాట‌లు సినిమాని ప్ర‌త్యేకంగా మార్చాయి. తండ్రిపై అంతులేని ప్రేమ ఉన్న ఓ కొడుకు పూర్తి జీవితాన్ని తెర‌పైన ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం ఇందులో క‌నిపిస్తుంది. ‘అర్జున్‌రెడ్డి’ త‌ర‌హాలో ఓ చిన్న క‌థ‌తో సినిమాని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత హీరో బాల్యం, అత‌ని ప్రేమ స‌న్నివేశాల‌తో క‌థ‌ని ముందుకు న‌డిపించాడు. త‌న సోద‌రిని ర్యాగింగ్ చేశార‌ని కాలేజీకి వెళ్లి చేసే హంగామా నుంచి సినిమాలో వేగం పుంజుకుంటుంది. ఆ ఎపిసోడ్‌తో పాటు, చాలా స‌న్నివేశాలు అర్జున్‌రెడ్డి సినిమాని గుర్తు చేస్తాయి. (Animal movie review in telugu) నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ని కూడా ఆస‌క్తిక‌రంగా మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు భార్యాభ‌ర్త‌లుగా వాళ్ల ప్ర‌యాణాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. కథానాయ‌కుడు అమెరికా నుంచి వ‌చ్చాక సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది. బ‌ల్బీర్‌సింగ్‌పై హ‌త్యాయ‌త్నం త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. త‌న తండ్రికి ప్రాణాపాయం ఉంద‌ని తెలిశాక విజ‌య్ త‌న‌దైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే తీరు ఆ నేప‌థ్యంలో పండిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. మ‌నిషిని పోలిన మ‌నిషిని క‌థ‌లోకి తీసుకొచ్చే అంశం సినిమాని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చింది. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. బుల్లెట్ల వ‌ర్షం కురుస్తూ సాగే ఆ స‌న్నివేశాలు మాస్ ప్రేక్ష‌కుల్ని కిక్కెకించేలా ఉంటాయి. ప్ర‌థ‌మార్ధంతోనే దాదాపు క‌థ ఉంటుంది.

ద్వితీయార్ధంలో అస‌లు శ‌త్రువుని క‌నిపెట్టడం, అంతం చేయ‌డం ప్ర‌ధానంగా ఉంటుంది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని సంభాష‌ణ‌లు ఇబ్బంది పెడ‌తాయి. నాయకానాయిక‌ల మ‌ధ్య ఫ్లైట్‌లో తొలి రాత్రి, హోట‌ల్‌లోకి చొర‌బ‌డిన మూడు వంద‌ల మందిని మెషీన్‌గ‌న్‌తో కాల్చి చంపడం వంటి స‌న్నివేశాలు మ‌రీ నాట‌కీయంగా అనిపిస్తాయి. క‌థానాయ‌కుడు మ‌రో అమ్మాయితో క‌లిసి గ‌డిపాడ‌ని క‌థానాయిక‌కి తెలిశాక ఆ ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. తండ్రీ కొడుకుల మ‌ధ్య స‌న్నివేశాల‌తోనే క‌థ‌ని ముగింపునివ్వ‌డం గొప్ప విష‌యం.(Animal movie review in telugu) ఆ స‌న్నివేశాలతో బ‌ల‌మైన భావోద్వేగాల్ని పండించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. తెలిసిన క‌థ‌నే నేటిత‌రం ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాని తీయ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. సినిమాని కొన‌సాగుతుంద‌ని చెబుతూ ఆఖ‌రులో చూపించిన స‌న్నివేశాలు త‌దుప‌రి భాగంపై మ‌రిన్ని అంచ‌నాల్ని రేకెత్తిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌ట‌న సినిమాకి హైలైట్‌. ఓ ప్ర‌త్యేక‌మైన న‌డ‌వ‌డికతో కూడిన త‌న పాత్ర‌లో ఆయ‌న న‌ట‌న గుర్తుండిపోయేలా ఉంటుంది. భిన్న కోణాల్లో క‌నిపిస్తూ, వాటి మ‌ధ్య అంతే వైవిధ్యం ప్ర‌దర్శిస్తూ ఆయ‌న పాత్ర‌లో ఒదిగిపోయారు. ర‌ణ్‌బీర్ – అనిల్ క‌పూర్‌, ర‌ణ్‌బీర్ – ర‌ష్మిక మ‌ధ్య స‌న్నివేశాలు సినిమాకి ప్రధానబలం. అనిల్ క‌పూర్ సినిమాకి మ‌రో బ‌లం. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి, త‌న కొడుకుకి ఇవ్వాల‌నుకున్న ఓ తండ్రిగా ఆయ‌న క‌నిపిస్తారు. త‌న కొడుకుకి స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోయాన‌నే ప‌శ్చాత్తాపంతో క‌నిపించే తండ్రిగా ప‌తాక స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంటుంది. ర‌ష్మిక బ‌ల‌మైన పాత్ర‌లో క‌నిపించింది. (Animal movie review in telugu) ప్రేయ‌సిగా, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా అందంగా క‌నిపిస్తూనే, న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న స‌న్నివేశాల‌తో క‌ట్టిప‌డేసింది. బాబీ దేవోల్ క‌నిపించేది కొద్దిసేపే అయినా ఆయ‌న సినిమాపై చాలా ప్ర‌భావం చూపిస్తారు. త్రిప్తి డిమ్రి పాత్ర క‌థ‌లో కీల‌క మ‌లుపునకు కార‌ణం అవుతుంది. శ‌క్తిక‌పూర్, పృథ్వీరాజ్‌, సిద్ధార్థ్ కార్నిక్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సినిమా సాంకేతికంగా ఉన్న‌తంగా ఉంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ నేప‌థ్య సంగీతం థియేటర్‌ నుంచి బయటకు వచ్చినా వెంటాడుతూనే ఉంటుంది. భావోద్వేగాల్ని పండించ‌డంలో ఆయ‌న సంగీతం పాత్ర చాలా ఉంది. అమిత్‌రాయ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. (Animal movie review in telugu) సందీప్ రెడ్డి వంగా ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా ఆయ‌నే చేశారు. త‌న‌లోని ద‌ర్శ‌కుడితో ఎడిట‌ర్ రాజీప‌డ‌టంతో సినిమా సుదీర్ఘంగా సాగుతుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

బ‌లాలు
+ భావోద్వేగాలు
+ క‌థానాయ‌కుడి పాత్ర.. ర‌ణ్‌బీర్ న‌ట‌న
+ విరామ స‌న్నివేశాలు, నేప‌థ్య సంగీతం

బ‌ల‌హీన‌త‌లు
– హింసాత్మ‌క స‌న్నివేశాలు
– కొన్ని సంభాష‌ణ‌లు… నిడివి

చివ‌రిగా..: యానిమ‌ల్‌… తండ్రి కోసం ఓ కొడుకు చేసిన యుద్ధం! (Animal movie review in telugu)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z