DailyDose

కోర్టులో లొంగిపోయిన భాస్కర్‌రెడ్డి-నేర వార్తలు

కోర్టులో లొంగిపోయిన భాస్కర్‌రెడ్డి-నేర వార్తలు

మణిపుర్‌లో సినీ ఫక్కీలో భారీ చోరీ

మణిపుర్‌లో సినీ ఫక్కీలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఉఖ్రుల్‌ జిల్లా కేంద్రంలో దొంగలు  రెచ్చిపోయారు. ఓ ప్రభుత్వ బ్యాంకులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేసి బ్యాంకులో రూ.18.80కోట్ల డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం 10 మంది  గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి అధునాతన ఆయుధాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోకి ప్రవేశించారు. ఆర్‌బీఐ, ఏటీఎంలకు పంపేందుకు నగదును ఇక్కడే నిల్వ చేస్తుంటారు.ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్‌కు 80కి.మీల దూరంలో ఉంటుంది. దీనిపై కన్నేసిన దుండగులు గురువారం సాయంత్రం బ్యాంకులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరింపులకు గురిచేశారు. వారందరినీ వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి బంధించారు. వీరిలో సీనియర్‌ ఉద్యోగిని తుపాకీతో బెదిరించి ఖజానాను బలవంతంగా తెరిపించారు. అందులో ఉన్న ఖజానాను దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకొనేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

కోర్టులో లొంగిపోయిన భాస్కర్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కి కండిషన్ బెయిల్ ముగిసింది. కండిషన్ బెయిల్ ముగియడంతో సీబీఐ కోర్టులో భాస్కర్‌రెడ్డి లొంగిపోయారు. ఇప్పటికే భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఐ కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 30 వరకు కండిషన్ బెయిల్ మీద భాస్కర్‌రెడ్డి బయట ఉన్నారు. కండిషన్ బెయిల్ ముగియడంతో చంచల్ గూడా జైల్లో భాస్కర్‌రెడ్డి లొంగిపోయారు. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో భాస్కర్‌రెడ్డి ఉన్నారు.

హనుమకొండ జిల్లాలో దారుణం

ఒకరు చేసిన ప్రమాదానికి మరొకరి ప్రాణాలు పోతున్నాయి. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోక.. కారు, బైక్ ఉంది కదా అని రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ ప్రమాదాల వల్ల ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. అబ్బే అస్సలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత అడ్డగోలుగా రోడ్లపైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మనుషుల పాలిట యములుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ ఎక్కుతున్న ఓ మహిళని అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. అప్పుడే కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న క్రమంలో కవిత అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరోవైపు ఢీకొట్టిన కారు నెంబర్ TS03 FA9881గా గుర్తించారు.కాగా.. ప్రమాదం చేసిన వ్యక్తి ఓ ఉన్నతాధికారి కొడుకుగా గుర్తించారు. ఈ ప్రమాదం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మరోవైపు.. ఈ ప్రమాదంపై నిన్నటినుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఓ ఉన్నత అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్ లో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం డెడ్ బాడీ మృతురాలి ఇంటి దగ్గర ఉంది.. బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేస్తున్నారు.

మైనర్ బాలికపై లైంగిక దాడి 

మైనర్ బాలికపై లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ సైట్-III ప్రాంతంలో బాధిత బాలిక ( 9 ) , తన తల్లిదండ్రులు , సోదరితో కలిసి నివాసం ఉంటుంది. బాధిత బాలిక ఇంటి దగ్గరలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కి చెందిన జన్నా సాయి కుమార్ ( 23 ) బోరబండ సాయి బాబా నగర్ లో ఉంటూ.. కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. ఎన్నికల నేపథ్యంలో బాధిత బాలిక తల్లిదండ్రులు బుధవారం.రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లటంతో బాలిక ఆడుకుంటుంది. దాంతో జన్నా సాయి కుమార్ మైనర్ బాలిక ను బెదిరించి లైంగిక దాడి కి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఏడుస్తుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు అడగగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బోరబండ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయి ఆచూకీ కోసం గాలించగా శ్రీకాకుళం జిల్లా సిత్తాపూర్ లో గురువారం రాత్రి దొరికాడు. దాంతో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడి పై పోక్సో కేసు నమోదు చేసినట్లు బోరబండ సీఐ విజయ్ తెలిపారు.

మణిపూర్‌లో భారీ బ్యాంకు చోరీ

గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ చోరీ జరిగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దుండగులు కోట్ల కొద్దీ నగదును దోచుకెళ్లారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బ్యాంక్‌ మేనేజర్‌, సిబ్బంది రోజు లావాదేవీలు, డిపాజిట్‌ కార్యకలాపాలను ముగించారు. కస్టమర్లు లోపలికి రాకుండా బ్యాంకు బయట ఉన్న మెయిన్‌ షట్టర్‌ను మూసేసి లోపల పనిచేసుకుంటున్నారు. ఆ సమయంలో సుమారు 10 మంది గుర్తు తెలియని సాయుధ దుండగులు (unidentified armed men) అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర విధుల్లో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.18.85 కోట్ల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు.ఈ దొంగతనానికి సంబంధించిన దృష్యాలు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి. దుండగులు ఏకే రైఫిల్స్ సహా పలు ఆయుధాలతో లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో ఇది మూడో భారీ బ్యాంకు దోపిడీ ఘటన కావడం గమనార్హం.

సీరియల్ కిల్లర్ కోసం గాలింపు

ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సీరియల్ కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి బరేలీలో ఆరు నెలల వ్యవధిలో 9 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. ఒంటరి మహిళలే టార్గెట్ అవుతుండటంతో మహిళలు ఎవరూ కూడా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు.ఈ హత్యల నేపథ్యంలో యూపీ పోలీసులు పలు ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. నగరంలోని షాహి, ఫతేగంజ్ వెస్ట్ మరియు షీష్‌గఢ్ ప్రాంతాలలో గత కొన్ని నెలల్లో చాలా కేసులు నమోదయ్యాయి. హత్యలకు గురవుతున్న మహిళలందరూ.. 50-65 ఏళ్ల వయసులో ఉన్నట్లు గుర్తించారు.మహిళలందర్ని గొంతులు కోసి చంపారని, వారి మృతదేహాలు పొలాల్లో కనిపించాయని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు ముందు మహిళలపై దోపిడి కానీ అత్యాచారం, లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు గుర్తించారు. నగరంలోని స్థానికులు అవసరమైతే తప్పా తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు చెప్పారు.హత్యకు గురైన మహిళల్లో ఒకరి కుమార్తె..55 ఏళ్ల తన తల్లి పొలానికి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు చెరుకు తోటలో సదరు మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేందుకు 8 మంది అధికారులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. బరేలీలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచారు. హత్యలకు గురైన కొంతమంది మహిళల పోస్ట్‌మార్టం రిపోర్టు గురించి ఎదురుచూస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

కోటాలో ఆగని బలవన్మరణాలు

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో విద్యార్థుల బలవన్మరణాకు ఆగడంలేదు. ఆత్మహత్యలను నివారించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలించటంలేదు. ఇప్పటికే పలువురు విద్యార్థులు పరీక్షల భయం, మానసిక ఒత్తిడి కారణంగా తనువు చాలించగా, తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలో నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న 21 ఏళ్ల నిషా యాదవ్ బుధవారం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాది కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఆత్మహత్యల సంఖ్య 29కి చేరింది. యూపీలోని ఔరయా జిల్లాకు చెందిన నిషా యాదవ్, కోటాలోని మహవీర్ నగర్‌లో ఉంటూ నీట్ పరీక్షలకు సిద్ధమవుతోంది.గత రెండు రోజుల నుంచి నిషా ఆమె ఇంటికి ఫోన్ చేయకపోవడంతో పాటు తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫోన్ చేసినా బదులు లేదని తోటి విద్యార్థులకు ఆమె తండ్రి తెలియజేయాగా, వారు తలిపులు పగలగొట్టి చూస్తే నిషా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి గదిలో సూసైడ్ నోట్ లాంటిదేదీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఇటీవల కోటా జిల్లాలో అన్ని కోచింగ్ సెంటర్లలో తప్పనిసరి చేసిన యాంటీ హ్యాంగింగ్ పరికరాన్ని నిషా ఉంటున్న గదిలో అమర్చలేదని పోలీసులు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z