ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన శాసనసభ ఎన్నికల (Assembly Elections)కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వెలువడ్డాయి. ఇందులో రెండు రాష్ట్రాలు భాజపా (BJP)కు, రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ (Congress)కు చేజిక్కే అవకాశముందని ముందస్తు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చించేందుకు భాజపా నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.
శుక్రవారం సాయంత్రం దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీలతో అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు ఆదివారం (డిసెంబరు 3) ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు ఉంటుందని అంచనాలు వెలువడగా.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh), రాజస్థాన్ (Rajasthan)లలో కమలం వికసించే అవకాశాలున్నట్లు కన్పిస్తున్నాయి. మిజోరంలో ‘జొరాం పీపుల్స్ మూవ్‌మెంట్’ (జడ్‌పీఎం), ‘మిజో నేషనల్ ఫ్రంట్’ (ఎంఎన్‌ఎఫ్) మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. అయితే, ఈ అంచనాలపై కొందరు రాజకీయ నేతలు అవిశ్వాసం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3న వెలువడనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో భారాస, మధ్యప్రదేశ్‌లో భాజపా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతాయా? లేదా అన్నది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే..!
👉 – Please join our whatsapp channel here –