కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నట్లు ఈవో చెప్పారు. ఈ సందర్భంగా డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు గాను టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు.
ఈవో వెల్లడించిన మరిన్ని కీలక విషయాలు..
తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుంచి 4,23,500 టోకెన్లు జారీ చేస్తాం.
తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.
దర్శనానికి టోకెన్లు తీసుకున్న భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాం.
డిసెంబరు 22 నుంచి 24 వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేస్తున్నాం. ఈ సేవలను డిసెంబరు 25 నుంచి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తాం.
డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తాం.
వైకుంఠ ఏకాదశి పర్యదినం రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తాం.
నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం ఉంటుంది. అదేరోజు గీతాజయంతి రావడంతో భగవద్గీత అఖండపారాయణం నిర్వహిస్తాం.
తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న ధ్యానారామంలో నవంబరు 14న ప్రారంభమైన రుద్రాభిషేకం డిసెంబరు 12వ తేదీ వరకు కొనసాగుతుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 12వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం జరుగుతుంది.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో డిసెంబరు 23న గీతాజయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తాం.
2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, దిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలులోని తితిదే కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.
తిరుమలలో గదులు పొందిన భక్తులు కాషన్ డిపాజిట్ ప్రస్తుత స్థితిని తెలుసుకునేందుకు తితిదే వెబ్‌సైట్‌లో కాషన్ డిపాజిట్ రీఫండ్ ట్రాకర్‌ను పొందుపరిచాం.
👉 – Please join our whatsapp channel here –