తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం పోటీపడిన రెండు ప్రధాన పార్టీలు ఆదాయానికి మించిన హామీలను, పథకాలను ప్రకటించాయి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ హామీల అమలుకు కొత్త ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రజలపై పన్నుల రూపంలో మరింత భారం వేయక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఐదు లక్షల కోట్లకు పైగా అప్పుభారంతో ఉన్న రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేయాలంటే రెండు ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో మొదటిది ఆదాయం పెంచుకునేవిధంగా కార్యాచరణ, రెండవది అనర్హులను గుర్తించి, లబ్ధిదారుల సంఖ్యను కుదించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవటం.
ఆదాయం పెంపుపై నజర్
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే జీఎస్టీ విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మార్పులు చేయలేవు. కనుక ఆదాయ మార్గాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పన్నుల విషయంలో భారీ పెరుగుదల చూసే అవకాశం ఉంది. ముఖ్య ఆదాయాలైన ఇంధనం (పెట్రోల్, డీజిల్) లపై 5 నుంచి 10 రూపాయలు పెంపు, వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము వాహన ధరలపై ప్రస్తుతం 12 నుంచి 16 శాతం వరకు ఉంది. ఇకనుంచి దీనిని 16 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.
భూములు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ధరలు ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా మరో యాభై శాతం పెంచే అవకాశం ఉంది. మద్యంపైన యథావిధిగా మరొక 30 నుంచి 50శాతం పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థలలో ఇంటి పన్నులతోపాటు ఇతర పన్నులపెరుగుదల, ఆర్టీసీ బస్సుల చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెరుగుదల వీటన్నిటిని 2024 ఏడాది చివరికి రాష్ట్ర ప్రజలు చూసే అవకాశం ఉంది. మన రాష్ట్రానికి బంగారు బాతు వంటి ఐటీ రంగంలో మరింత వృద్ధిని సాధించాలి. అయితే, ఈ రంగంలో పనిచేసేవారు అధికంగా ఇతర రాష్ట్రాల వారే అయినప్పటికీ వారి వేతనంలో అధిక భాగం ఇక్కడే ఖర్చు చేయడం, పన్నుల రూపంలో చెల్లింపు ద్వారా ఐటీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నారు.
లబ్ధిదారుల సంఖ్య కుదింపు
హామీల అమలు కొత్త సర్కారుకు మరొక తీవ్రమైన సమస్యగా మారనుంది. సంక్షేమ పథకాలను అనర్హులకు కూడా అందించడం ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. ఉదాహరణకు రూ.40, 50 లక్షల రూపాయల ఖర్చుతో అమ్మాయిల పెండ్లి చేసిన కుటుంబాలు కూడా కల్యాణలక్ష్మి పొందుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ పథకాలకు అనర్హులను గుర్తించడం అనగానే ముందుగా గుర్తొచ్చేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలు అందవు.
ఇక్కడ 30 వేల జీతం కూడా రానివారిని మాత్రం అనర్హులుగా చేసి ప్రైవేట్ రంగంలో లక్షలలో జీతాలు సంపాదించే ఉద్యోగులు, కోట్లు సంపాదిస్తున్న వ్యాపారస్తులు మాత్రం వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, సమాచార సేకరణలో లోపం తదితర కారణాల వల్ల అనర్హులైన ధనికులు కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధిను పొందుతూ ఉంటారు. కానీ. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారం ప్రభుత్వాలు ఇచ్చిన విపరీత హామీలు అమలు చేయాలంటే అనర్హులుగా గుర్తించినంత మాత్రాన కూడా అందరికీ అందించే పరిస్థితి కనపడటం లేదు. అనర్హులకు ఉచిత పథకాలు అందించడం కూడా సమ సమాజ స్థాపన స్ఫూర్తికి విరుద్ధం.
అనర్హులను గుర్తించేలా చర్యలు
లబ్ధిదారుల ఆదాయాలు, ఆస్తులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలి. నిరు పేదలను గుర్తించాలి. నిర్దిష్ట ఆదాయం పొందుతున్నవారు, విలాసవంతమైన వాహనాలను కలిగి ఉన్నవారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి మినహాయించాలి. వ్యాపారుల ఆదాయాలను లోటుపాట్లు లేకుండా గుర్తించి నిర్దేశిత ఆదాయాలు కలిగినవారిని తొలగించడం వంటి చర్యలు తప్పనిసరి చేయాలి. అదేవిధంగా కుటుంబాలకు ఉన్న స్థిరాస్తుల విలువను లెక్కగట్టి ఒక పరిధి దాటిన ఆస్తి కలిగి ఉన్నవారిని ప్రభుత్వ ఉచిత పథకాల నుంచి మినహాయించవచ్చు. ఈ విధంగా సాంకేతికతను, సరైన సమాచారాన్ని సేకరించాలి. సంక్షేమ పథకాలు అవసరం లేనివారిని తొలగించడం ద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించవచ్చు. కేవలం పేదలను మాత్రమే అర్హులుగా గుర్తించి వారి అభివృద్ధి కోసం పథకాలు అమలు చేయాలి. ప్రభుత్వం సక్రమంగా పేదలకు పథకాలు అమలుచేస్తే ఎవరికీ నష్టం ఉండదు.
👉 – Please join our whatsapp channel here –