NRI-NRT

ప్రమాదంలో ఉన్న భారతీయ విద్యార్థిని రక్షించిన యూఎస్ పోలీసులు

ప్రమాదంలో ఉన్న భారతీయ విద్యార్థిని రక్షించిన యూఎస్ పోలీసులు

ఏడు నెలలపాటు తీవ్ర వేదనకు గురైన ఒక భారతీయ విద్యార్థిని తాజాగా అమెరికా (USA) పోలీసులు రక్షించారు. అతడిని బంధించి మూడు ఇళ్లలో బలవంతంగా పనిచేయించారని, కనీసం అతడికి బాత్రూమ్‌ సదుపాయం లేకుండా వేదనకు గురిచేశారని గుర్తించారు. పీవీసీ పైపులతో అతడిని శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ చార్లెస్‌ కౌంటీలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారిపై కిడ్నాప్‌, మానవ అక్రమ రవాణా, దాడి వంటి నేరాభియోగాలు మోపారు. ప్రస్తుతం బాధితుడిని రక్షించిన పోలీసులు.. ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాధితుడు వెల్లడించిన వివరాలు, కోర్టు పత్రాల ప్రకారం..

బాధితుడి పేరును పోలీసులు బయటకు వెల్లడించలేదు. అతడు మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌ అండ్ టెక్నాలజీలో చదువుకునేందుకు ఎన్నో ఆశలతో గతేడాది అమెరికా వచ్చాడు. ఈ ఏప్రిల్‌లో సదరు విద్యార్థిని నిందితుడు వెంకటేశ్‌ ఆర్‌ సత్తారు తన ఇంటికి తీసుకువచ్చాడు. వారిద్దరూ బంధువులు కూడా. ఆ తర్వాత నుంచి బలవంతంగా ఇంటి పనులు  చేయించడం మొదలుపెట్టాడు. ఉదయం 4.30కు మొదలుపెట్టి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేదని బాధితుడు తెలిపాడు.  సత్తారు తన ఐటీ సంస్థతో పాటు అతడికున్న మూడు ఇళ్లలో కూడా పనులు చేయించేవాడు. గత ఏడు నెలలుగా అతడిని ఒక బేస్‌మెంట్‌లో బంధించారు. అక్కడే కాంక్రీట్ ఫ్లోర్‌పైనే నిద్రించాల్సి వచ్చేది.  అక్కడ కనీసం బాత్రూమ్ సదుపాయం లేదని ఆ అభియోగాలను బట్టి తెలుస్తోంది.

కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోనిచ్చేవారని, సరిగా తిండి కూడా పెట్టలేదని బాధిత విద్యార్థి తెలిపాడు. బంధించి కూడా తనపై సీసీకెమెరాల ద్వారా నిఘా పెట్టారన్నాడు. ఇచ్చిన పని సరిగా చేయకపోతే.. ముగ్గురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టేవారు. కొన్నిసార్లు దుస్తులు తీయించి, ఒళ్లంతా కుళ్లబొడిచేవారు. ఎలక్ట్రిక్ వైర్లు,  పీవీసీపైపులతో దాడి చేసేవారు. అతడి ఒంటిపై గాయాలున్నాయని, పలు చోట్ల ఎముకలు చిట్లాయని, ఇదొక అమానవీయ ఘటన అని కోర్టు పత్రాల్లో అధికారులు పేర్కొన్నారు.

911కి వచ్చిన ఫోన్‌ కాల్ ద్వారా పోలీసులు బుధవారం సత్తారు ఇంటికి వెళ్లారు. అయితే వారిని లోపలికి రానివ్వలేదు. అదే సమయంలో బేస్‌మెంట్‌ నుంచి బాధిత విద్యార్థి పరిగెత్తుకొచ్చాడని, అప్పుడు అతడు ఒంటినిండా గాయాలతో, వణుకుతూ కనిపించాడని వెల్లడించారు. సత్తారుతో పాటు మిగతా ఇద్దరు నిందితులు నిఖిల్ వర్మ, శ్రావణ్‌ వర్మ తన స్టూడెంట్ వీసా కోసం సహకరిస్తున్నారని భావించానని, అయితే వారు తన పత్రాలను ధ్వంసం చేశారని ఆ విద్యార్థి ఆరోపించాడు. సత్తారు ధనవంతుడని, భారత్‌లోని రాజకీయ నేతలతో సంబంధాలున్నట్లు చెప్పాడు. అతడు ఒక రింగ్ లీడర్‌ అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిపై మానవ అక్రమరవాణాకు దోహదం చేసేలా పత్రాలను దుర్వినియోగం చేస్తున్నాడనే అభియోగాలను మోపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z