చిరు ధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్న భారత్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి కోడెక్స్ ఏలిమెంటేరియస్ కమిషన్ (సీఏసీ) ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)లు ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తన 46వ సమావేశాన్ని ఇటీవల ఇటలీ రాజధాని రోమ్‌లో జరుపుకొంది. సీఏసీ ఇంతవరకు జొన్నలు, సజ్జలు, పప్పు గింజలకే నాణ్యాతా ప్రమాణాలను నిర్ధారించింది. వీటికితోడు రాగులు, అరికెలు, కొర్రలు, సామలు, ఓదెలు, వరిగెలకు కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను రూపొందించాలని భారత్ చేసిన ప్రతిపాదనను రోమ్‌లోని ఎఫ్‌ఏఓ కార్యాలయంలో జరిగిన సీఏసీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 188 సభ్యదేశాలతో ఏర్పడిన సీఏసీలో 161 దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. వాటిలో ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు కూడా ఉన్నాయి. 2023ను అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సీఏసీ ఏకగ్రీవ తీర్మానం చరిత్రాత్మకమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రశంసించారు.
👉 – Please join our whatsapp channel here –