DailyDose

సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు- నేర వార్తలు

సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు- నేర వార్తలు

సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు

 సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సూరారం పోలీసులతో పాటు సంయుక్త ఆపరేషన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. ఈ దాడిలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులు, వారి నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందన్నారు.ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘డ్రగ్స్ తయారు చేస్తున్నవారిలో ప్రధాన నిందితుడు కె.శ్రీనివాస్‌గా గుర్తించాం. అతను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నగరంలోని గాజుల రామారంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు శ్రీనివాస్‌కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉంది. 2013లో ఓ పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేయగా.. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు జైలుకు పంపారు. జైలు నుంచి బయటికి వచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిసి సూరారంలో ఒక ఇంట్లో డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ముగ్గురూ కలిసి గత రెండేళ్లుగా డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ తీసుకొని ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుంది. అలా తయారు చేసిన మాదకద్రవ్యాలను వివిధ ప్రాంతాల్లో విక్రయించారు. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారు’’ అని ఎస్పీ వివరించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై పీడియాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

కూతురు అదృశ్యంపై ఫిర్యాదు

కాపాడాల్సిన రక్షకభటుడే కాటేయజూశాడు. అండగా వచ్చాడనుకుంటే అవకాశం తీసుకోవాలనుకున్నాడు. పుట్టెడు వేదనలో ఉన్న బాధితురాలిపై లైంగికదాడికి విఫలయత్నం చేశాడు. చాలారోజులు ఎవ్వరికీ చెప్పుకోలేక ఆవేదనను అణచిపెట్టుకుంది. తనలా మరో మహిళ ఇలాంటి ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ నిర్వాకాన్ని బహిర్గతం చేసింది. సోషల్‌ మీడియా కేంద్రంగా ఇప్పుడా వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఆమె ఆరోపించిన మేరకు వివరాలిలా ఉన్నాయి.ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడు భద్రావతి కాలనీకి చెందిన పేరూరు దుర్గమ్మ మైనర్‌ కుమార్తె సెప్టెంబర్‌ నెల 23న గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి బాలికను వెతికేందుకు హెడ్‌కానిస్టేబుల్‌ భాస్కర్‌, మహిళా పోలీసు రేవతిలను దుర్గమ్మతో పాటు అక్టోబర్‌ 6వ తేదీన హైదారాబాదుకు పంపించారు. అక్కడ ఓలాడ్జిలో హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్గమ్మతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఎంత వారించినా చెయిపట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించి బూతులు మాట్లాడాడు. ఇందుకు మహిళా పోలీసుల కూడా సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక ఫోన్‌ చేయడంతో అందరూ వెనుతిరిగి వచ్చారు.ఈ విషయాలన్నీ వివరిస్తూ దుర్గమ్మ వీడియో తీసింది. అందులో కొద్ది రోజుల తర్వాత తన కుమార్తె మళ్లీ అదే అబ్బాయితో వెళ్లింద, తమకు న్యాయం చేయలేదని కూడా పేర్కొంది. ఈ వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అమెతో మాట్లాడించారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోతే జిల్లా ఎస్‌పీకి ఫిర్యాదు చేసిన వారు, ఇంత జరిగితే స్థానికంగా లేదా ఉన్నతాధికారులకు గానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయ సందేహం వ్యక్తం చేశారు.

కారు బైక్ ఢీ

కారు బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా అల్మాస్ పుర గ్రామానికి చెందిన సింగరవేణి సత్తయ్య (49) నల్ల మడుగు గ్రామంలో తన బంధువుల ఇంటికి బైక్ పైన వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎర్రపహడ్ గ్రామ శివారులో మోతె గేటు వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందగానే అక్కడికి చేసుకుని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఐడీబీఐ బ్యాంకులో రుణాల పేరుతో మోసం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో రుణాల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.. దర్యాప్తు చేపట్టింది. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన నిందితులు.. ఐడీబీఐ బ్యాంకులో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు.దాదాపు రూ.311.50 కోట్లను నిందితులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆ రుణాలతో సొంత వ్యాపారాలు, ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది నవంబర్‌  29న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన స్థిర, చరాస్తులు సీజ్‌ చేశారు.

* దంతేవాడలో రెచ్చిపోయిన మావోయిస్టులు

 ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం దంతేవాడ జిల్లాలో పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఓ మీడియా ప్రతినిధి సహా ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు బ్లాస్టింగ్‌కు పాల్పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

*   మిజోరంలో 80.66 శాతం పోలింగ్‌

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్‌ నమోదైందని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్‌ అధికారి (CEO) మధుప్‌ వ్యాస్‌ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 80.03 శాతం ఓట్లు పోలయ్యాయని, ఈసారి అది 80.66 శాతానికి పెరిగిందని తెలిపారు.ఈ నెల 4న మిజోరంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని మధుప్‌ వ్యాస్‌ వెల్లడించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నానికల్లా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా, మిజోరం అసెంబ్లీకి నవంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటు మిజోరంలో కూడా డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరగాల్సి ఉండె. కానీ మిజోరం కౌంటింగ్‌ను ఈ నెల 4కు వాయిదా వేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z