గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు.
ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్‌హౌస్‌వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే.
మాటలే తప్ప చేతల్లేవు
2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్‌హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ.
చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది.
గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు.
కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి.
వేడెక్కుతున్న భూమి
భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది.
కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి.
ఏమిటీ కర్బన ఉద్గారాలు?
బొగ్గు, చమురు, గ్యాస్‌ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్‌లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌లోని ఎక్స్‌టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్‌స్టెయిన్ కుండబద్దలు కొట్టారు!
👉 – Please join our whatsapp channel here –