జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం స్థిరాస్తి వ్యాపార సంస్థలో పనిచేశారు. వాస్తవానికి పాలకుర్తి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తొలుత వేరే అభ్యర్థిని ప్రకటించింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆమె తన స్థానంలో కోడలు యశస్వినికి అవకాశమివ్వాలని కోరడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించి టికెట్ ఇచ్చింది.
ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్. ఎన్నికల్లో వరుసగా గెలుస్తూనే ఉన్నారు. దయాకర్‌రావు 1994 నుంచి 2009 వరకు వర్ధన్నపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు గెలిచారు. ఆ తర్వాత 2008లో టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామాలు చేయడంతో.. ఉప ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. ఎర్రబెల్లి పాలకుర్తి నియోకజవర్గానికి వెళ్లి అక్కడి నుంచి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆయన మళ్లీ టీడీపీ నుంచే పోటీ చేసి పాలకుర్తిలో విజయం సాధించారు. అనంతరం 2016లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పదవి దక్కింది.. ఈసారి కూడా ఆయన విజయం ఖాయమని భావించారు.. కానీ పిన్నవయస్కురాలు యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 40 ఏళ్ల ఎర్రబెల్లి దయాకరరావు రాజకీయ చరిత్రను కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత హనుమాండ్ల ఝాన్సీ యశస్విని రెడ్డి కుటుంబం దేనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. దయాకరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి యశశ్వినిరెడ్డి 46,402ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి మెజారిటీతో యశస్విని రెడ్డి సత్తా చాటారు. 46,402 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశశ్విని రెడ్డి మాట్లాడుతూ… ఎర్రబెల్లి దయాకర్ రావు 40 ఏళ్ల రాజకీయ చరిత్రకు పాలకుర్తి ప్రజలు స్వస్తి పలికారని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z