కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జిగర్ తండ’కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ చిత్రం విజయోత్సవ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కార్తీక సుబ్బరాజ్, ఎస్‌జె సూర్య, రాఘవ లారెన్స్, నవీన్ చంద్ర, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు మంచి విజయాన్ని అందించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాలో అసలైన హీరో అని నా మనసులో ఉంది. ఈ సినిమాకి దేవుడి ఆశీస్సులు చాలా ఉన్నాయి, అదే ఈ సినిమాకు భారీ విజయాన్ని ఇచ్చింది. నా అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. వారందరూ నా కుటుంబ సభ్యులే.’ అని ఆయన అన్నారు.
ఉచిత కళ్యాణ మండపం
అభిమానులకు మరో శుభవార్తను లారెన్స్ ఇలా తెలిపాడు.. ‘సినిమా విడుదలైన ప్రతిసారీ నా అభిమానులకు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అందుకే మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలో నిర్మించబోతున్నాను. అందులో నా అభిమానులు ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే.. నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇచ్చి నన్ను పెళ్లికి ఆహ్వానించారు. అప్పుడు పెళ్లి ఎక్కడ అని అడిగాను. అప్పుడు అతను తన ఇంట్లోనే అంటూ.. సరైన వసతిలేదని తెలిపాడు. కళ్యాణమండపంలో పెళ్లి చేసుకుందామనుకుంటే అంత డబ్బు లేదని తెలిపాడు.
పెళ్లి సమయంలో సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి అలా బాధగా కనిపించేసరికి నాకు నచ్చలేదు. దీంతో వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే మా అమ్మ పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు. అని లారెన్స్ తెలిపాడు.
👉 – Please join our whatsapp channel here –