‘ఎందెందు వెదికినా.. అందందు గలదు!’.. ఈ వాక్యం నిత్యామీనన్‌కు అతికినట్టు సరిపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నది. వెండితెరపైనే కాదు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అదరగొడుతున్నది. ఇటీవలే ‘కుమారి శ్రీమతి’, ‘మాస్టర్ పీస్’ వెబ్‌సిరీస్‌లతో అలరించింది. తన సినీ ప్రయాణం, పెళ్లి గురించి.. నిత్య ఇలా ముచ్చటించింది.
‘కుమారి శ్రీమతి’లో నా పాత్ర పైపైకి సాధారణంగా కనిపించినా.. శ్రీమతి పట్టుదల చాలా గొప్పది. తన కలను నిజం చేసుకోడానికి ఎంతో శ్రమిస్తుంది. ఎందరినో ఒప్పిస్తుంది. అవరోధాలను అధిగమిస్తుంది. సగటు తెలుగు అమ్మాయి తనను స్ఫూర్తిగా తీసుకోవాలి. వ్యాపారం వైపు అడుగులేయాలి.
నేను చేసే పాత్రలు చాలెంజింగ్‌గా ఉండాలని కోరుకుంటాను. కొన్నిసార్లు.. ఈజీగానే పూర్తవ్వాలని భావిస్తాను! ఎలా ఉన్నా.. ప్రతి పాత్రనూ ఎంజాయ్ చేస్తూ నటిస్తాను. అలా కుదరని పక్షంలో వెండితెరకు దూరంగా ఉండిపోతాను. ఒకసారి ఇలాగే.. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాను.
సినిమా స్క్రిప్ట్ ఓకే చేయడం చిటికెలో పని. ఏమంత సీరియస్ వ్యవహారం కాదు. ఒక ప్రాజెక్టును ఒప్పుకోవడానికి వంద కారణాలు కనిపిస్తాయి. డైరెక్టర్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, పాత్ర కావచ్చు.. ఇలా ఏది నచ్చినా ఆ సినిమా అంగీకరిస్తాను. నా బాధ్యతకు న్యాయం చేస్తాను. ఫలితాలు పట్టించుకోను.
‘జీవితం’ అనేది నిత్యనూతనంగా ఉండాలని కోరుకుంటాను. రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. అది చిన్నపిల్లల నుంచైనా.. ప్రకృతి నుంచైనా.. చుట్టుపక్కల వారిని చూసైనా! నేను చేసిన తప్పుల నుంచి కూడా కొత్త పాఠాలు నేర్చుకుంటాను! మీకు సలహాలు ఇచ్చేవారు గొప్ప వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు. మీరు చేసే చిన్నచిన్న తప్పులే.. మీకు విలువైన పాఠాలు బోధిస్తాయి!
కష్టపడి పనిచేయడాన్ని ఇష్టపడతాను! కానీ, తీరిక లేకుండా పనిలోనే మునిగిపోవడం నాకు నచ్చదు. పని చేయాలి. ఆ తర్వాత విశ్రాంతీ తీసుకోవాలి. ఆ సమయంలో సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలి. విశ్రాంతి వల్ల ఆలోచనలు వికసిస్తాయి. ఇదే నా సిద్ధాంతం.
మన జీవితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. దాని దారిలో అది వెళ్తూనే ఉంటుంది. మనం చేయాల్సింది.. ఫాలో కావడమే! నిజానికి జర్నలిస్ట్ కావాలన్నది నా ఆశయం. కానీ, నటిగా మీ ముందున్నా. కొన్నిసార్లు మనకు ఏమాత్రం తెలియకుండానే.. మన అభిరుచులు, ఇష్టాయిష్టాలు వదులుకోవాల్సి వస్తుంది.
సెలెబ్రిటీ అనగానే.. అందరి దృష్టీ మనపైనే ఉంటుంది. ఏం చేసినా, ఏం మాట్లాడినా.. సెన్సేషనే! అలా ఉండటం నాకు నచ్చదు. ఎందుకంటే.. మన పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు.
సంస్కృతిపరంగా దక్షిణాదికి- ఉత్తరాదికి వ్యత్యాసం ఉంటుందని అంటారు. కానీ, నాకు మాత్రం.. పెద్ద తేడా కనిపించలేదు. ఇక భాష అంటారా? అదీ పెద్ద విషయం కాదు. మా అమ్మానాన్నలది కేరళ. నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. తెలుగు చిత్రసీమలో స్థిరపడ్డాను! కోలీవుడ్‌లోనూ పేరు తెచ్చుకున్నాను! ఇలా దక్షిణాది మొత్తం చుట్టేశాను! బాలీవుడ్-ఓటీటీ ద్వారా ఉత్తరాదివారికి కూడా దగ్గరయ్యాను!
👉 – Please join our whatsapp channel here –