Politics

లిస్టు చాలానే ఉంది!

లిస్టు చాలానే ఉంది!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్‌ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.

కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరినే సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌లో జోష్‌ నింపే యత్నం చేశారు.

మరొకవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు.

మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్‌రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్‌ తప్పకుండా అనివార్యం కావొచ్చు.

ఎప్పటిలోగా..?
కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్‌ నుంచి సిద్ధరామయ్యవ్ర పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్‌ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్‌ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్‌ విషయంలో కాంగ్రెస్‌ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడి ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి.

లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్‌ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్‌గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్‌ అధిష్టానం దీనిపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టక తప్పదు..!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z