DailyDose

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో తొలిరోజే 485మందికి జాబ్ ఆఫర్లు

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో తొలిరోజే 485మందికి జాబ్ ఆఫర్లు

ప్రఖ్యాత కాన్పూర్‌ ఐఐటీలో కొలువుల సందడి మొదలైంది. తొలి రోజు పలు ప్రఖ్యాత కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు అదరగొట్టారు. ఒకే రోజు 485 మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌, ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు(పీపీవో) అందుకున్నారు. మరో 12 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లను దక్కించుకున్నారు. కాన్పూర్‌ ఐఐటీలో 2023-24 ఏడాదికి గాను మైక్రోసాఫ్ట్‌, నావి, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, క్వాల్కమ్‌, డ్యుయిష్ బ్యాంక్ సంస్థలు టాప్‌ నియామక సంస్థలుగా నిలిచాయి. 216 మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు (పీపీఓ) అందుకొన్నట్లు ఐఐటీ కాన్పూర్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇకపోతే, గతేడాది కూడా ఈ విద్యాసంస్థలో విద్యార్థులకు భారీగానే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఐఐటీ కాన్పూర్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌ డిసెంబర్‌ 1 నుంచి 15వరకు జరగ్గా.. 1,128 మంది ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. వీటిలో 208 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు (పీపీవో) ఉన్నాయి. గతేడాది అత్యధిక వార్షిక వేతనం దేశీయంగా రూ.1.9కోట్లు కాగా.. 33 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు అంగీకారం కుదుర్చుకున్నారు. అయితే, ఈసారి విద్యార్థులు సాధించిన ఉద్యోగాల వార్షిక ప్యాకేజీ వివరాలు ఇంకా తెలియలేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z