DailyDose

బీఆర్‌ఎస్‌ జెడ్పీ చైర్మన్‌ మృతి- తాజా వార్తలు

బీఆర్‌ఎస్‌ జెడ్పీ చైర్మన్‌ మృతి- తాజా వార్తలు

* విజయసాయిరెడ్డి చంద్రబాబునాయుడుపై ఎక్స్‌లో తీవ్ర విమర్శలు

యువ ఓటర్ల కోసం ‘‘టీడీపీ మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్’’ ఫోరం పేరుతో యువ ఓటర్ల కోసం కూకట్‌పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో టీడీపీ మద్దతు దారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, యువ ఓటర్లు పాలుపంచుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. చంద్రబాబు విజన్ 2047 ను కొత్త ఓటర్లకు వివరిస్తూ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.‘‘చంద్రబాబు గారి గుణమే…స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడడం. యువ ఓటర్లు మొదటి ఓటు CBNకు వేయాలట! ఆయన సామాజికవర్గం వారు కూకట్‌పల్లిలో సోమవారం ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట’’ అని విజయసాయి ఎక్స్‌లో ఎద్దేవ చేశారు.

తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన విజ్ఞప్తి

 ఏపీపై మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుపాను బాధితులకు ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులు అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇది పంటలు చేతికి వచ్చే సమయం అని, పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతాంగం కుదేలైపోతోందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం లెక్కించడంలో మానవతా దృక్పథంతో అధికారులు వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

* బీఆర్‌ఎస్‌ జెడ్పీ చైర్మన్‌ మృతి

జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయనకు సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా భారాస అధ్యక్షుడిగా ఉన్నారు. సంపత్‌రెడ్డి ఆకస్మిక మృతికి పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

* తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు 

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహన రాకపోకులకు అంతరాయం కలుగుతోంది. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా అధికారులతో కలిసి టీటీడీ జేఈవో ఘాట్ రోడ్లలో తనిఖీలు చేపట్టారు. వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్‌లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్, ఫారెస్ట్, సెక్యూరిటీ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా, సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి డీకే శివకుమార్‌

గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ నుంచి డీకే శివకుమార్‌ బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా కొలిక్కిరాకపోవడంతో.. ఇవాళ తెలంగాణ సీఎం ప్రమాణస్వీకారం లేనట్టేనని సమాచారం అందుతోంది. రేపు ఢిల్లీకి ఏఐసీసీ అబ్జర్వర్‌ వెళ్లనున్నారు. మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ అబ్జర్వర్‌ భేటీకానున్నారు.

* బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది జనసేన పార్టీ.. అయితే, ఒక్కచోట కూడా విజయం సాధించకపోగా.. డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.. తాజాగా, అనంతపురంలో ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.ఇక, ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదన్నారు నందిగాం సురేష్.. వైఎస్‌ జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి.. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేనన్న ఆయన.. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది.. వైఎస్సార్ సీపీ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి… జగన్ ను భయపెట్టే మగ్గాడు ఇంత వరకు పుట్టలేదని వ్యాఖ్యానించారు ఎంపీ నందిగాం సురేష్. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్‌ కూడా వెళ్లారు.. కానీ, పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.. మొత్తం 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లిలో మాత్రమే ప్రస్తావించదగిన స్థానంలో ఉన్నారు. కానీ, చివరికి ఇక్కడ కూడా ఓడిపోయారు.

* రాష్ట్రవ్యాప్తంగా రాజాసింగ్ సేవలు

రాజాసింగ్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం ఆయన ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. గోషామహల్‌లో రాజాసింగ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ముఖ్యంగా మజ్లిస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగించారన్నారు.ఈ శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్, బీఆర్ఎస్ అధినేతలు అసదుద్దీన్, కేసీఆర్ చాలా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. అధికార దుర్వినియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా ప్రజా తీర్పు, ధర్మం, న్యాయం, జాతీయ భావజాలమే గెలిచిందన్నారు. రాజాసింగ్ విజయం కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z