Politics

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్‌ను అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్‌కు సీఈవో వికాస్‌రాజ్‌ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై రద్దు చేశారు.

ముఖ్యమంత్రే తరువాయి..!
ఇక కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్‌ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్‌ను కలవనుంది. కాంగ్రెస్ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. వీలైనంత వరకు ఈ ప్రక్రియ ఇవాళే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మంత్రులకు వాహనాలు సిద్ధం
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్‌కు వెళ్లి.. ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందించారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. దిల్‌కుష్‌ అతిథి గృహానికి వాహనాలను సిబ్బంది తీసుకొచ్చారు.

వీడని ఉత్కంఠ
సీఎల్పీ నాయకుడు ఎవరన్నదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు అప్పగించారు. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాష్ట్ర నాయకత్వం పంపిన తీర్మానాన్ని అధ్యయనం చేసి అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో అధిష్ఠానం నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేచిచూస్తున్నారు. అటు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోటల్‌ నుంచి వెళ్లిపోయారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z