Agriculture

ఏపీలో పలుజిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు

ఏపీలో పలుజిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తుపాను కారణంగా బాపట్ల (Bapatla) మండలం సూర్యలంక అడవి పల్లెపాలెం తీరంలో సముద్రం కల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తిరుపతి (Tirupati) జిల్లా వరదయ్యపాలెం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. గోవర్ధనపురం, సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, కాడూరు వద్ద సున్నపు కాలువ, పాండూరు వద్ద రాళ్లవాగు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉద్ధృతికి ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరదయ్యపాలెం చెరువుకు గండి పడే ప్రమాదం ఉండటంతో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

తిరుమల(Tirumala)లోనూ తుపాను ప్రభావం ఉంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చలితో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి ఆనకట్ట వద్ద 2,004 అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతుంది. వర్షాల కారణంగా నదీ ప్రవాహం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని లంక మిట్టకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దీంతో అవసరమైన వారిని ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తుపాను ప్రభావంతో నెల్లూరు (Nellore) నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 13 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా ఉమ్మడి కృష్ణా (Krishna) జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఉమ్మడి చిత్తూరు (Chittoor) జిల్లాలో తుపాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతమైన సుళ్లూరుపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z