ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections 2023) మూడు రాష్ట్రాల్లో భాజపా (BJP) స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)పై ప్రశంసలు కురిపించారు. పార్టీలో తన బాధ్యతలను నడ్డా సమర్థవంతంగా నిర్వహించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నప్పటికీ.. ఆ ప్రభావం పార్టీపై పడకుండా పనిచేశారని అభినందించారు.‘‘పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అవిశ్రాంత కృషి వల్లే మూడు రాష్ట్రాల్లో భాజపా విజయాలు సాధ్యమయ్యాయి. ఎన్నికలకు ముందు ఆయన తన కుటుంబంలోని ఓ వ్యక్తిని కోల్పోయారు. అయినప్పటికీ.. మనోధైర్యం కోల్పోకుండా పూర్తి నిబద్ధత, అంకితభావంతో పార్టీని ముందుకు నడిపించారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు వెలువడిన తర్వాత జేపీ నడ్డా కుటుంబసభ్యులతో కలిసి దిల్లీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన.. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి మూడు రాష్ట్రాల ఫలితాలు నిదర్శనమని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –