DailyDose

ఇంతకీ తుపానులకు పేర్లు ఎందుకు పెడతారు?

ఇంతకీ తుపానులకు పేర్లు ఎందుకు పెడతారు?

ఈ సంవత్సరంలో నాలుగో తుపాను ఇప్పుడు భారతదేశాన్ని చుట్టుముట్టేయడానికి సిద్ధంగా ఉందని వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ‘మిథిలీ’ తుపాను బీభత్సం మరువక ముందే ‘మిచాంగ్’ తుపాను విరుచుకుపడబోతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ‘మిచాంగ్’ తుపాను డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇంతకీ తుపానులకు పేర్లు ఎందుకు పెడతారు? వాటి మధ్య తేడాలేమైనా ఉంటాయా?

హుద్‌హుద్‌.. తిత్లీ.. పెథాయ్‌ పేర్లు వేరైనా ఇవన్నీ మన దేశంలో విరుచుకుపడిన తుపానులే. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవించినప్పుడు వాటి మధ్య తేడా, ప్రభావాలను గుర్తించేందుకు వాటికి ఇలా పేర్లు పెడుతుంటారు. ఆగ్నేయాసియాలోని దేశాలే తుపానులకు పేర్లు పెడుతుంటాయి. ఉదాహరణకు తిత్లీ పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. గతంలో ఒడిశా, పశ్చిమ బంగాలను వణికించిన తుపానుకు అంఫన్‌ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్‌. అంఫన్‌ అంటే థాయిలాండ్‌ భాషలో ఆకాశం అని అర్థం.

కనీసం 61 కిలోమీటర్ల వేగం కలిగిన గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే వాటికి పేర్లు పెట్టడమనేది సంప్రదాయంగా వస్తోంది. అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే తుపాన్లను సైక్లోన్స్‌ అని పిలుస్తారు. ఆస్టేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్‌ ఇండీస్‌ దీవుల్లోని తుపాన్ల ను హరికేన్స్‌ అని అంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరు నుంచి మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని బంగ్లాదేశ్, భారత్‌, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెడుతుంటారు.

2018లో ఈ జాబితాలో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, యెమెన్‌ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. నిసర్గా తుపానుకు బంగ్లాదేశ్‌, గతి తుపానుకు భారత్‌, నివార్‌కు ఇరాన్‌, బురేవికి మాల్దీవులు, తౌక్టేకి మయన్మార్‌, యాస్‌కి ఒమన్‌ పేర్లు పెట్టాయి. భారతదేశం.. గతితో పాటు తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్లను సూచించింది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఉచ్ఛరించడానికి సులభంగా, ఎనిమిది అక్షరాలలోపే ఉండాలి. ఇవి ఎవరి భావోద్వేగాలను, విశ్వాసాలను దెబ్బతీయకూడని విధంగా ఉండాలి.

తుపాన్లకు పేర్లు పెట్టడం వలన వాటిని గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది. ఆ తుపాను కదలికల మీద హెచ్చరికలు జారీ చేయడానికి వీలవుతుంది. ఒకేసారి రెండు, మూడు తుపానులు వచ్చిన పక్షంలో వాటిని గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఈ పేర్ల వలన ఏ తుపాను ఎప్పుడు వచ్చిందనేది గుర్తుపెట్టుకోవడం మరింత సులభమవుతుంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ విధానం అనువుగా ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z