Devotional

తేరళన్దూరు గోపాలకృష్ణుడు

తేరళన్దూరు గోపాలకృష్ణుడు

శ్రీ మహావిష్ణువు కృష్ణావతారందాల్చి గోవులను,గోకులాన్ని రక్షించినందున
ఆయనకి గోపాలుడు అనే పేరు కలిగిన విషయం అందరికీ తెలిసినదే.

కాని కృష్ణావతారానికి ముందే  శ్రీమహావిష్ణువు గోపాలకునిగా జన్మించిన దివ్యస్ధలం ఒకటి వున్నది.
అదే తిరువళన్దూరు  అనబడే తేరళన్దూర్.

ఒకసారి శివ కేశవులు ఇద్దరూ  లీలా వినోదంగా  పాచికలాట ఆడారు.  ఆ ఆటలో
గెలుపోటములను నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా
పార్వతీ దేవిని నియమించారు. పార్వతి  సోదరప్రేమ కనపరుస్తూ
శ్రీ మహావిష్ణువు గెలిచినట్టు ప్రకటించింది.
దానితో  పరమశివుడు
ఆగ్రహించి
పార్వతి దేవిని గోవుగా జన్మించమని  శాపం యిచ్చాడు. ఫలితంగా
పార్వతీ దేవి
భూలోకంలో గోవుగా జన్మించింది.
ఈ  విపరీత పరిణామానికి దుఃఖించిన లక్ష్మి, సరస్వతులు కూడా
గోవుల రూపాలు ధరించి పార్వతికి తోడుగా భూలోకానికి వచ్చారు. తల్లిని వదలి వుండలేకపోయిన పార్వతీ తనయుడు
వినాయకుడు కూడా దూడ రూపంతో వారితో భూలోకానికి వెళ్ళాడు.
అక్కడ ఒక సుందరమైన  చందన వనంలో యీ దైవీక గోవులు నివాసమేర్పర్చుకోగా
శ్రీ మహావిష్ణువు రక్షకుని బాధ్యతలు చేపట్టాడు.
అందువలన  ఈ స్థలంలో వెలసిన లక్ష్మీనారాయణునికి
” గోచార ఆమరువియప్పర్ “అనే
నామం వచ్చింది.

ఒకరోజు  ఊర్ధ్వ రధనుడు అనే  గంధర్వరాజు  తన రధంలో ఆకాశమార్గాన పయనిస్తూ వచ్చాడు.   ఆ రధం యొక్క వేగ చలనం వలన గోవులకు  తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. ఇది చూసి గోపాలుని రూపంలో వున్న శ్రీహరి
తన పాదాలతో  ఆ గంధర్వుని రధాన్ని అధఃపాతాళానికి త్రొక్కి వేశాడు. ఆవిధంగా రధం త్రొక్కివేయబడిన ఊరు అయినందున తేరళన్దూరు  అనే పేరు ఆ ఊరికి కలిగిందని
స్ధలపురాణం తెలుపుతున్నది.
ఈ ఊరు , నాగై జిల్లాలోని  కుత్తాళమ్ సమీపానవున్నది.
ఇక్కడి వైష్ణవాలయంలో సెంగమలవల్లీ తాయారు సమేతంగా
శ్రీ ఆమరువియప్పరు
కొలువై వున్నాడు.
ఈ ఆలయంలో ప్రముఖ ఆళ్వారులెందరో మంగళాశాసనాలు  చేశారు.  108 వైష్ణవ దివ్యదేశాలలో  10 వ దివ్యదేశంగా,  తిరుమంగై ఆళ్వారు  ఇక్కడి తాయారుని కీర్తిస్తూ 42 పాశురాలను
అనుగ్రహించారు.

” తిరు” అంటే లక్ష్మీదేవి.
లక్ష్మీదేవి నివసించి అనుగ్రహం కటాక్షించిన స్ధలమవడం వలన యీ
స్ధలానికి తిరువళన్దూరు అనే పేరు వచ్చింది.
తమిళ  భాషలో రామాయణకావ్యాన్ని
వ్రాసిన కంబరు మహా కవియొక్క జన్మస్థలం
కూడా ఈ తిరువళన్దూరే.
దైవాంశ కలిగిన పశువులకు  బాధ కలిగించిన  ఊర్ధ్వరధనుడికి  గో హత్యాదోషం కలిగినది.
దోష విముక్తికై , తాయారుని, గోచార పెరుమాళ్ ని  ప్రార్ధించి
1000 బిందెల వెన్నతో  అర్చించాడు.

ముల్లోకాలనేలే ఇక్కడి మహావిష్ణువుని దేవాధిరాజన్ అని పిలుస్తారు.

ఈ వృత్తాంతానికి  నిదర్శనంగా పుష్యమాస అమావాస్యనాడు ,  భాద్రపదమాస  శనివారంనాడు ఈ ఆలయంలోని మూలమూర్తికి ఘనంగా వెన్నను  సమర్పించే
ఆచారము  ఇంకా కొనసాగుతున్నది.

ఈ ఆలయంలోని స్వామి దర్శనానికి వచ్చిన తిరుమంగైఆళ్వారు , ఆలయ సమీపాన  వున్న వారితో  ” స్వామి, వారి పేరు ఏమిటని అడుగగా
వారు ‘ దేవాధిరాజన్’ అని సమాధానం
చెప్పారు .” అంటే దేవేంద్రుని ఆలయమా ..” అని స్వామిని దర్శించకుండా వెనుతిరిగిన
ఆళ్వారు అడుగులు ముందుకు పడలేదు.  తన కాళ్ళను ఎవరో సంకెళ్ళతో  బంధించినట్లు అక్కడే వుండిపోయారు.
తదుపరి , ఇదంతా పెరుమాళ్ లీలా వినోదంగా గ్రహించి
“జన్మించగానే
తమ తల్లితండ్రుల కాలి సంకెలలను  విడగొట్టిన
పెరుమాళ్ ని దర్శించకుండా , మనసారా స్తుతించకుండా  వెళ్ళిపోవడం అనుచితమని
భావించి , తిరుమంగైయాళ్వారు
పెరుమాళ్ మీద స్తోత్రపాఠాలు చెప్పారు.

ఈ సంఘటన జరిగినదనడానికి నిదర్శనంగా  ఆలయానికి ఎదురుగా ఆళ్వారు కాళ్ళకు సంకెలలు వేసిన
ప్రాంతంలో తిరుమంగైయాళ్వారు కి
ప్రత్యేక సన్నిధి వున్నది.
ఈనాటికీ  మూలవిరాట్ పూజలు జరిగిన తరువాత ఆళ్వారుకి పూజలు జరుపుతారు.
13 అడుగుల  ఎత్తున  ఆశ్చర్యం కలిగించే సౌందర్యంతో  పూర్తిగా సాలగ్రామ విగ్రహంగా
యీ గోచార పెరుమాళ్
కొలువై వున్నాడు.
గర్భగుడిలో  ఒక పెద్ద గోవు ,దూడలతో సహా పంచలోహ ఉత్సవమూర్తిగా  దర్శనమిస్తున్నాడు.
మూల విగ్రహానికి ప్రక్కన ప్రహ్లాదుడు, కావేరీ నదీమతల్లి,  మార్కండేయ మహర్షి, గరుడాళ్వార్
విగ్రహాలు కూడా ప్రతిష్టించబడివున్నాయి

ఇతర  వైష్ణవాలయాలలో మహావిష్ణువు కి ఎదురుగా దర్శనమిచ్చే
గరుడాళ్వారు , ఈ ఆలయంలో మహావిష్ణువుకి  అతిదగ్గరగా వుండడం విశేషం.   ఇక్కడ దేవేంద్రుడు సమర్పించిన ఇంద్ర విమానం మరో విశేషం.

మార్కండేయుడు తన ఆయుర్దాయం కోసం వేడుకొన్న  ఆలయం.
సెంగమల తాయారు
వార్షికోత్సవాలను ప్రత్యేకంగా
జరపడం విశేషం.ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

తమ తమ ఉద్యోగాలలో ఉన్నత పదవులు ఆశించే వారు, సిరిసంపదలు
కోరుకునేవారు  ఈ ఆలయంలో ప్రార్ధనలు జరిపి తమ వాంఛితాలు నెరవేర్చుకుంటారు. సెంగమలతాయారుని పూజించిన పోయిన సిరిసంపదలు తిరిగి దొరుకుతాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z