Devotional

తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆహార నాణ్యతపై విమర్శలు

తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆహార నాణ్యతపై విమర్శలు

తిరుమలలో(Tirumala) నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు తితిదే సిబ్బందిపై తిరగబడ్డారు. సోమవారం రాత్రి కొందరు అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు అన్నదాన కేంద్రానికి వచ్చారు. సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందని చెబుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న తితిదే ఉద్యోగి చెంగల్రాయులుతో వాగ్వాదానికి దిగారు.

‘అసలు ఇది అన్నమా.. ఎవరూ తినలేకపోతున్నారు. మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఆకుల్లో వదిలేశారో.. దారుణంగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదానం సూపరింటెండెంట్‌, ఏఈవోను పిలవాలంటూ గొడవకు దిగారు. చలికి అన్నం ఆరిపోయి అలా అయ్యిందని ఉద్యోగి చెప్పగా, భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. రూ.కోట్లలో కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్నం అందించలేరా అంటూ మహిళలు ప్రశ్నించారు. అన్నప్రసాదాలను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.

తరచూ ఫిర్యాదులు.. మిల్లర్ల నుంచి కొనుగోలేదీ?
అన్నప్రసాదం నాణ్యతపై తితిదే అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. తితిదే డయల్‌ యువర్‌ ఈవో, సోషల్‌ మీడియా వేదికగా కొందరు ఇదే విషయమై తరచూ ప్రస్తావిస్తుండటంతో ప్రస్తుత గుత్తేదారుల నుంచి కాకుండా మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదు. బియ్యం నుంచి నిత్యావసర సరకుల వరకు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తామని తితిదే చెబుతున్నా… నాణ్యతపై విమర్శలు తప్పడం లేదు.

అత్యున్నత ప్రమాణాలు: తితిదే ఛైర్మన్‌
తిరుమలకు రోజూ వచ్చే భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భక్తుల గొడవ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో తితిదే ప్రథమస్థానంలో నిలుస్తోందన్నారు. కొందరు మాత్రమే మిగిలిన భక్తులను రెచ్చగొట్టేలా మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు.

దాతల విరాళాలు ఏమవుతున్నాయో తెలపాలి: నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కళ్లకు అద్దుకుని, శ్రీవారే అందించినదిగా భావించే అన్నప్రసాదం ఇప్పుడు అధ్వానంగా మారిందని, వైకాపా నాయకులు దేవుడి ప్రసాదంలోనూ అవినీతి చేస్తున్నారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో భోజన నాణ్యతపై భక్తుల ఆందోళన… కొండపై అవినీతికి నిదర్శనమని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘తిరుమలలో 1985లో ఎన్టీఆర్‌ ప్రారంభించిన అన్నప్రసాదశాలలు వైకాపా సర్కారు వచ్చాక అవినీతి కేంద్రాలుగా మారాయి. లక్షల మంది దాతలు ఇస్తున్న విరాళాలు ఏమవుతున్నాయో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

బాలిక కుటుంబానికి ఇవ్వడానికి తితిదే వద్ద రూ.5లక్షలు లేవా?
‘చిన్నారిని చిరుతపులి చంపేస్తే ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అది ఇవ్వకపోగా.. వైకాపా ఎమ్మెల్యేలు బాలిక తల్లిదండ్రులను బెదిరించడం దారుణం. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చే తితిదే దగ్గర రూ.5లక్షలు లేవా’ అని ప్రశ్నించారు. ‘క్యూలైన్లలో భక్తులకు టిఫిన్‌, పిల్లలకు పాలు ఇవ్వడం ఆపేశారు. లడ్డూ నాణ్యత తగ్గించి ధర పెంచేశారు. గదుల అద్దె పెంచడం వంటివన్నీ శ్రీవారిని భక్తులకు దూరం చేసే కుట్రలు కావా’ అని లోకేశ్‌ నిలదీశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z