ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిగ్‌జాం తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి. సాగు నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించి పంటను కాపాడుకుంటే నోటికందే దశలో ప్రకృతి విపత్తు లాగేసింది. నీట మునిగిన పంటలు చూసిన కర్షకులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. పొలాల గట్ల వెంబడి తిరుగుతూ నీట మునిగిన పొలాలను చూసిన రైతుల గుండె తరుక్కుపోతోంది.
అప్పుల ఊబిలోకి…
మిగ్‌జాం తుపాను అన్నదాతను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక సాగుదారులు మౌనవేదనతో తల్లడిల్లిపోతున్నారు. గతేడాది మాండౌస్…. ఈసారి మిగ్‌జాం రూపంలో రైతులను నిండా ముంచాయి. డెల్టాలో వరి పంట పూర్తిగా నీటి పాలు కాగా మిగిలిన పంటలదీ అదే పరిస్థితి. మొత్తం మీద తుపాను కర్షకులను కోలుకోలేని దెబ్బతీసింది.
మినుమును మింగేసింది..
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మినుము పంట మరో పది రోజుల్లో నూర్పిడి చేయాల్సి ఉంది. పొలాలు మొత్తం వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో కాయలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల పంట పూర్తిగా కోల్పోయినట్లేనని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబరు, నవంబరు నెలల్లో నాటిన పొగాకు మొక్కలు ముంపుబారిన పడడంతో నీటిలో మునిగి కుళ్లిపోయి చనిపోతాయి. మొక్కల కొనుగోలు, పొలాలు నీటితో తడపడానికి ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టడంతో పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు నాట్లు చనిపోతే పంట ప్రారంభంలోనే నష్టం వాటిల్లినట్లవుతోంది.
నవంబరు నెలలో సాగు చేసిన శనగ పంట ప్రస్తుతం లేత మొక్కల దశలో ఉంది. ఈ క్రమంలో వచ్చిన వర్షాల వల్ల లేత మొక్కలు నీటిలో మునిగిపోయాయి. ఇవి నల్లరేగడి పొలాలు కావడంతో నీరు బయటికి వెళ్లకపోగా పొలాలు ఆరే పరిస్థితి లేదు. ఈ పంట కూడా నష్టపోయినట్లే.
మిర్చి పంట ప్రస్తుతం కాయలతో నిండి ఉంది. గాలులకు మొక్కలు విరిగిపోవడం, కొన్నిచోట్ల వర్షాల తీవ్రతకు మొక్కలు ఉరకెత్తడంతో పంట దెబ్బతింది. పండుగా మారిన కాయల్లో వర్షపు నీరు చేరి తెల్లగా మారిపోయి తాలుకాయలు అవుతాయి. చెట్లలో ఉన్న కాయలు కూడా నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిచోట్ల కోత కోసి ఆరబెట్టిన మిరపకాయలు తడిసిపోయి నష్టం వాటిల్లింది.
తుపానుతో గాలులతో కూడిన వర్షాల వల్ల అరటి, బొప్పాయి, కంద, పసుపు, కూరగాయలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపోవడంతో కొన్ని నెలల పాటు కాపాడుకున్న పంటలు మొత్తం నష్టపోయారు. ఉద్యానపంటలకు కూడా తీరని నష్టం జరిగింది.
శనగ మొత్తం ఊడ్చుకుపోయింది..నేను 22 ఎకరాల్లో శనగ పైరు వేశా. ప్రస్తుత పూత దశలో ఉంది. తుపాను ధాటికి మొత్తం నీట మునిగిపోయింది. అసలు పొలం అన్న ఆనవాలు లేకుండా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రూ.వేలాది పెట్టుబడి పెట్టా. మొత్తం ఊడ్చుకుపోయింది.
ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే…నేను 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. ఒకసారి నాగలితో గింజలు వేస్తే మొలవలేదు. మళ్లీ విత్తనాలు తెచ్చి చిమ్మాను. సద్దు వచ్చి రెండోసారీ పోయింది. మళ్లీ నారు తెచ్చి నాట్లు వేయించాను. కౌలు ఎకరాకు రూ.20 వేలు చెల్లించాలి. పెట్టుబడి రూ.25 వేలు వరకు అయ్యింది. ఇంట్లో ఉన్నది, కొంత అప్పు చేసి మొత్తం రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టా. ఇప్పుడు అంతా పోయింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీడం లేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం.
ఆకు కూరలు మొత్తం మునిగిపోయాయి
నేను దుగ్గిరాలలో రెండున్నర ఎకరాల్లో ఆకుకూరలు వేశా. తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఇలా వేర్వేరు రకాలు సాగు చేస్తున్నా. ఒక పంట కాకపోతే మరోటి ఆదుకుంటుందని ఆశించా. వర్షానికి అన్నీ దెబ్బతిన్నాయి. కొన్నయితే నీళ్లలోనే ఉండిపోయాయి. తోటకూర వేసిన చేను చెరువులా అయిపోయింది. రూ.2 లక్షలకు పైగా నష్టం వచ్చింది. నా వంతు ప్రయత్నంగా గండ్లు కొడుతున్నాను.
కోతకొచ్చిన సమయంలో పెను నష్టం
పది ఎకరాలు కౌలుకు తీసుకుని బీపీటీ రకం వరి సాగు చేశాను. పంట పూర్తిగా చేతికొచ్చే దశకు చేరుకుంది. కోతకు ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో ఇలా తుపాను వచ్చి మా ఆశలపై నీళ్లు చల్లింది. గాలులకు సోమవారం నేల వాలిన పంట మంగళవారం పూర్తిగా నీట మునిగింది. ఇదే పరిస్థితి బుధవారం కూడా కొనసాగితే రంగు మారడం, ధాన్యం మొలకెత్తడం ఖాయం. ఈ పరిస్థితితో కౌలు రైతులమందరమూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు బీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
మూడు పంటలూ నష్టమే…
నేను ఈ ఏడాది మూడు పంటలు వేశా. తుపానుకు వరి నేలవాలింది. గతంలో మినుము తెగుళ్లతో నష్టపోయా. ఇంతకుముందుకు వర్షానికి మొక్కజొన్న కుళ్లిపోయి మొలక రాలేదు. ఒక్కో పంటకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోయా. ఎవరికి చెప్పుకున్నా తీర్చేవారు లేరు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతోనే ఉన్నాం.
ఎకరాకు ఐదు క్వింటాళ్ల నష్టం..
20 ఎకరాల్లో మిరప సాగు చేశా. మొన్నటి వరకు పంట కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో ట్యాంకర్ల ద్వారా తడి పెట్టడంతో అదనంగా ఖర్చయ్యింది. ఇప్పుడేమో తుపాను ధాటికి కాయలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. తోటలో పూత, గూడ రాలిపోతోంది. కాయ పాడైపోతుంది. ఒక్కో ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టా. ఎకరాకు 5 క్వింటాళ్లు నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
పైసా కూడా వచ్చేలా లేదు
పంటలు దెబ్బతినడం వల్ల చేతికి పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మేమెలా ఉన్నా చేను యజమానికి కౌలు కట్టాల్సిందేగా. నీటి ఇబ్బందులు, తెగుళ్ల కారణంగా తుపానుకు ముందు రెండు సార్లు పంట నష్టపోయాం. తుపాను వల్ల వరుసగా మూడోసారి పంట నష్టపోతున్నాం. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయగలం.
👉 – Please join our whatsapp channel here –