దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే సరికొత్త గరిష్ఠాలను తాకాయి. మంగళవారం సెన్సెక్స్ 69,296.14 దగ్గర, నిఫ్టీ 20,855.1 వద్ద స్థిరపడ్డాయి. ఈరోజు ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 217 పాయింట్లు పెరిగి 69,513 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 20,936 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.35 దగ్గర ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 సూచీలో ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న షేర్ల జాబితాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
అమెరికాలో అక్టోబర్‌కు సంబంధించిన ఉద్యోగ నియామక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. జాబ్ ఓపెనింగ్స్ అంచనాల కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించక తప్పదనే సంకేతాలు బలపడ్డాయి. ఫలితంగా అక్కడి స్టాక్ మార్కెట్లు (Stock Market) మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర 1.1 శాతం కుంగి 77.20 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం రూ.5,223.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.1,399.18 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –