NRI-NRT

US శాసనసభలో గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ తగ్గింపు బిల్లు

US శాసనసభలో గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ తగ్గింపు బిల్లు

అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీచేసే గ్రీన్‌ కార్డు (Green Card) కోసం ప్రపంచదేశాలకు చెందిన లక్షల మంది ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వీరిలో ప్రవాస భారతీయ ఉద్యోగుల వాటానే అత్యధికం. గ్రీన్‌ కార్డు రావాలంటే ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా చట్టసభ ముందుకు వచ్చింది. దీనిని ముగ్గురు చట్టసభ సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డు విషయంలో దేశాలపై ఉన్న వివక్షకు ఇది ముగింపు పలకనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం వేల మంది ప్రవాస భారతీయులకూ ప్రయోజనం కలుగుతుంది.

అమెరికాలో పౌరసత్వానికి తొలి మెట్టుగా భావించే గ్రీన్‌ కార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది నిరీక్షిస్తుండగా.. అందులో 10.5లక్షల (63శాతం) మందికిపైగా ప్రవాస భారతీయ ఉద్యోగులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా నుంచి 2.5 లక్షల మంది (14 శాతం) ఎదురు చూస్తున్నారు. ఏటా జారీ చేసే గ్రీన్‌ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతానికి మించి జారీ చేసే అవకాశం లేదు. దీంతో 10లక్షలకు పైగా భారతీయులు దీన్ని పొందాలంటే దశాబ్దాలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా బిల్లులో ఇప్పటివరకు ఉన్న ఏడు శాతం పరిమితిని తొలగించే అంశంతోపాటు కుటుంబ ఆధారిత వీసాలను ఏడు నుంచి 15శాతానికి పెంచే ప్రతిపాదనలున్నాయి.

HR 6542, ఇమ్మిగ్రేషన్‌ వీసా ఎఫీషియన్సీ అండ్‌ సెక్యూరిటీ యాక్ట్-2023 బిల్లును భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యులు రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయ్‌పాల్‌తోపాటు రిక్‌ మెక్‌కార్మిక్‌ అనే మరో కాంగ్రెస్‌ సభ్యుడు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఒకవేళ ఇది చట్టరూపం దాల్చితే.. ఎన్నో దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ప్రవాస భారతీయులకు శాశ్వత నివాస (Green Card) యోగం దక్కుతుంది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z